బంగ్లా మాజీ ప్రధాని హసీనాపై మరో వారెంట్ ఆమె సోదరి రిజ్వానాతో పాటు మరో 50 మందికీ జారీ

బంగ్లా మాజీ ప్రధాని హసీనాపై మరో వారెంట్ ఆమె సోదరి రిజ్వానాతో పాటు మరో 50 మందికీ జారీ

ఢాకా: బంగ్లాదేశ్‌‌‌‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి న్యాయస్థానం మరోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా భూమిని సేకరించారనే ఆరోపణలతో బంగ్లాలోని ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ స్పెషల్ కోర్టు ఆదివారం హసీనా, ఆమె సోదరి షేక్ రెహానా, బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిక్​తో పాటు మరో 50 మందిపై వారెంట్లు జారీ చేసింది. 

అవినీతి నిరోధక కమిషన్ (ఏసీసీ) దాఖలు చేసిన మూడు వేర్వేరు చార్జిషీట్‌‌లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ స్పెషల్ జడ్జి ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు అక్కడి ఓ వార్తాపత్రిక వెల్లడించింది. భూమి కేటాయింపులో అవినీతి ఆరోపణలపై మూడు వేర్వేరు కేసుల్లో 53 మందిపై ఏసీసీ ఇటీవల కోర్టుకు చార్జిషీట్లు సమర్పించింది. 

హసీనాతో సహా 53 మంది నిందితులు పరారీలో ఉండటంతో కోర్టు వారిపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసిందని ఆ పత్రిక తెలిపింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ నెల 10న రాజుక్ ప్లాట్ కేటాయింపులకు సంబంధించిన అవినీతి కేసులో హసీనా, ఆమె కుమార్తె సైమా వాజెద్ పుతుల్, మరో 17 మందిపై అదే కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.