మళ్లీ నవంబర్‎లోనే: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి భగ్గుమన్న జల వివాదం

మళ్లీ నవంబర్‎లోనే: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి భగ్గుమన్న జల వివాదం

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న కృష్ణ నది జలాల వివాదం మరోసారి భగ్గుమంది. నాగార్జునసాగర్ డ్యామ్ వేదికగా 2024, నవంబర్ 9 శనివారం తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం చెలరేగింది. అసలేం జరిగిందంటే.. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ వద్ద వాటర్ లెవెల్స్ తీసుకోవడానికి శనివారం (నవంబర్ 9) తెలంగాణ అధికారులు వెళ్లారు. ఈ క్రమంలో డ్యాంపై తెలంగాణ డ్యాం అధికారులను ఆంధ్ర డ్యామ్ అధికారులు అడ్డుకున్నారు. తెలంగాణ అధికారులకు ఇక్కడేం పని అంటూ నిలదీశారు ఏపీ ఆఫీసర్స్. 

కుడి కాలువకు నీటి విడుదలకు సంబంధించిన లెక్కలు చెప్పమని, రీడింగ్ తీయొద్దని మీరు ఎవరికైనా చెప్పుకోండని ఆంధ్ర అధికారులు తెగేసి చెప్పారు. దీంతో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు, కేఆర్ఎంబీ సమాచార గ్రూపులతో పాటు అధికారులకు నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ ఇరిగేషన్ అధికారులు సమాచారం అందించారు. 

దీంతో నాగార్జున సాగర్ డ్యామ్‎పై మరోసారి కృష్ణ జలాల వివాదం రాజుకుంది. కాగా, రాష్ట్ర విభజన జరిగిన 10 ఏండ్లు దాటినప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల వాటాల పంపకం పూర్తి కాలేదు. పలుమార్లు కూర్చొని మాట్లాడుకున్నప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటాలపై చర్చలు కొలిక్కి రాలేదు. గత ఏడాది నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ నాగార్జున సాగర్ డ్యామ్ పై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసింది.

 ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం రాజుకోవడంతో.. ఏపీ, తెలంగాణ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ పై పెద్ద ఎత్తున మెహరించారు. డ్యామ్ పై కంచెలు వేసి ఇరు వైపులా భారీగా బలగాలను రంగంలోకి దింపడంతో అప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్‎పై యుద్ధ వాతావరణం కనిపించింది. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ ఇదే నవంబర్ నెలలో కృష్ణ జలాలపై ఇరు రాష్ట్రాలు మధ్య వివాదం చెలరేగడం గమనార్హం.