
తెలంగాణ వాతావరణంలో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. ఎండ, వాన, చలి కలగలిసిన వాతావరణంతో రుతువులు అన్నీ ఒకేసారి వచ్చినట్లు మారిపోతోంది పరిస్థితి. ఉదయం ఎండ, మధ్యాహ్నం వాన, రాత్రికి చలి అన్నట్లుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు ఎండ దంచి కొడుతుంటే.. మరోవైపు వర్షాలు కురుస్తుండటంతో మూడు పూటలకు మూడు రుతువుల్లో ఉండే వాతావరణం తలపిస్తోంది.
రాష్టంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో గాలిలో తేమ శాతం పెరిగి అక్కడక్కడా క్యూమిలో నింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. మేఘాలు చల్లబడి గాలి దుమారంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గురువారం (ఏప్రిల్ 10) మధ్యాహ్నం నుంచి సాయంత్రం అంటే 3 గంటలన నుంచి 6 గంటల వరకు రైన్ అలెర్ట్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
అల్పపీడన ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోంది. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా క్యుమిలో నింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చిరించారు. దీంతో ఈ జిల్లాల్లో వచ్చే మూడు గంటల పాటు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
Also Read:-హైదరాబాద్ లో భారీ వర్షం.. ఈ టైంలో అస్సలు బయటికి రావద్దు..
అదే విధంగా కామారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి , మేడ్చల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వచ్చే మూడు గంటల పాటు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ లో వాతావరణం:
తెలంగాణ వ్యాప్తంగా మారిన వాతావరణ ప్రభావం హైదరాబాద్ పైన కూడా పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. నార్త్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో క్యుమిలో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. చందానగర్, మియాపూర్, కూకట్ పల్లి, బంజారాహిల్స్, జూబిలీహిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో కురుస్తున్నాయి. వాతావరణం ఉదయం ఎండ, సాయంత్రం వర్షం అన్నట్లుగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడికి రోడ్లపై రావాలంటే భయపడుతున్నారు నగర వాసులు.
మరో రెండు రోజులు ఇదే పరిస్థితి:
అల్పపీడన ప్రభావం మరోవారం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం (ఏప్రిల్ 11) ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. శనివారం కూడా వాతావరణ పరిస్థితులు అలాగే ఉండనున్నట్లు వెల్లడించారు. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు వీస్తాయని, గాలి వేగం గంటకు 30-40 కి.మీతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాల్లో శనివారం వరకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు అధికారులు.