- ఒకేసారి అన్ని వర్సిటీలకు వీసీల పేర్లు ప్రకటించనున్న ప్రభుత్వం
హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని సర్కార్ వర్సిటీలకు కొత్త వీసీలు వచ్చేందుకు మరో వారం టైమ్ పట్టనుంది. ఇప్పటికే ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, తెలుగు వర్సిటీ, జేఎన్టీయూ, శాతవాహన, పాలమూరు తదితర వర్సిటీల సెర్చ్ కమిటీ సమావేశాలు పూర్తయ్యాయి. ఈ నెల 15న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కమిటీ సమావేశం కానున్నది. అప్పట్లోగా జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ సమావేశం నిర్వహించేందుకు విద్యా శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముందుగా సెర్చ్ కమిటీల సమావేశాలు పూర్తయిన వర్సిటీల పేర్లను గవర్నర్కు పంపించాలని ప్రభుత్వం భావించింది. దీంతో దసరాకు ముందే కొత్త వీసీలను నియమిస్తారనే ప్రచారం జరిగింది.
కానీ వైద్యారోగ్యశాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరిధిలోని వర్సిటీలకూ సెర్చ్ కమిటీలు పెట్టాలని భావిస్తోంది. దీంతో అన్ని వర్సిటీలకు పేర్లు ఖరారు అయ్యాకే రాజ్ భవన్ కు పంపించాలని యోచిస్తోంది. ఇందతా పూర్తయ్యే వరకు మరో వారం పట్టొచ్చని అధికారులు చెప్తున్నారు. మరోపక్క కొన్ని వర్సిటీలకు వీసీలను ప్రకటిస్తే మిగిలిన వర్సిటీల సెలెక్షన్ పై సర్కారుపై ఒత్తిడి పెరుగుతుందని, దీంతో లాబీయింగ్ పెరిగే అవకాశం ఉందనే వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో కుల సమీకరణలు సరిగా లేకుంటే, వీసీ పోస్టులు రాని కులాలకు చెందిన వారంతా ఆందోళనలు చేసే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఒకేసారి అన్ని వర్సిటీల పేర్లు ప్రకటించాలని సర్కారు భావిస్తోంది.