ఐ ఫోన్, బుల్లెట్ బండి అమ్మి మరీ బెట్టింగ్.. చివరకు ఉరి వేసుకుని ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య

ఐ ఫోన్, బుల్లెట్ బండి అమ్మి మరీ బెట్టింగ్.. చివరకు ఉరి వేసుకుని ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: బెట్టింగ్ భూతానికి మరో హైదరాబాద్‎లో యువకుడి బలి అయ్యాడు. ఐఫోన్, బుల్లెట్ బండి అమ్ముకుని మరీ బెట్టింగ్ పెట్టి.. చివరకు నష్టాలు రావడంతో ఏం చేయాలో అర్థంకాక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక పూట తిని ఇంకో పూట ఉపాసం ఉండి కొడుకును ఉన్నత చదవులు చదివిస్తే.. కొడుకు చివరకు ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గద్వాల్ జిల్లా చెందిన పవన్ హైదరాబాద్‎లోని మాసబ్ ట్యాంక్ జేఎన్టీయూలో ఎంటెక్ చదువుతున్నాడు. అత్తాపూర్ రెడ్డి బస్తీలో నివాసం ఉంటోన్న పవన్ గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్‎లో బెట్టింగులు పెడుతున్నాడు. మొదట్లో బాగానే లాభాలు రావడంతో అత్యాశకు పోయాడు. ఒకేసారి లక్ష రూపాయలు బెట్టింగ్ పెట్టాడు. బెట్టింగ్‎లో ఓడిపోవడంతో ఒకేసారి లక్ష రూపాయలు పోయాయి.

 కాలేజీ ఫీజులు, హాస్టల్ ఫీజు కోసం తల్లిదండ్రులు పంపిన డబ్బులను సైతం బెట్టింగ్‎లో పెట్టి పొగొట్టుకున్నాడు. మొత్తం బెట్టింగ్ మైకంలో మునిగిపోయిన పవన్.. చివరకు తన ఐఫోన్, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‎ను అమ్ముకొని బెట్టింగ్‎కు పాల్పడ్డాడు పవన్. అవి కూడా పోయాయి. బెట్టింగ్ వల్ల ఒక్క రూపాయి లాభం రాకపోగా.. ఫోన్, బైక్, చివరకు తల్లిదండ్రులు పంపిన డబ్బులు కూడా పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. 

ఈ బాధలోనే గురువారం (ఏప్రిల్ 17) అత్తాపూర్ రెడ్డి బస్తీలో ఫ్యాన్‎కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చాడు. ఉన్నత చదవులు కోసం కొడుకుని నగరానికి పంపితే.. చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో పవన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

పవన్ ఆత్మహత్యకు బెట్టింగ్ ఒక్కటే కారణమా..? మరేదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బెట్టింగ్ యాప్‎ల ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు  కోల్పోవద్దని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నప్పటికీ.. నిత్యం ఇలాంటి ఘటనలో ఎక్కడో ఒక చోటు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇకనైనా యువత బెట్టింగ్ యాపులకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.