Champions Trophy 2025: కెరీర్ మొత్తం గాయాలే: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి సౌతాఫ్రికా స్టార్ బౌలర్ ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సౌతాఫ్రికా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. సఫారీల స్టార్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. నోర్ట్జే ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అతను ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్‌లో ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి ఫిట్‌గా ఉండడని సోమవారం (జనవరి 13) స్కాన్‌లు స్పష్టం చేశాయి. దీంతో స్వదేశంలో ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ లో అతను ప్రిటోరియా క్యాపిటల్స్ తరపున ఆడాల్సి ఉంది. 

నోర్ట్జే చివరి 6 ఐసీసీ ఈవెంట్స్ లో 3 ప్రధాన టోర్నీలకు దూరమయ్యాడు. 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో బొటన వేలి గాయం కారణంగా దూరమయ్యాడు. తుంటి గాయం కారణంగా 2023 వన్డే వరల్డ్ కప్ లో ఆడలేదు. తాజాగా వెన్ను నొప్పి గాయంతో వచ్చే నెలలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండడం లేదు. 2023 సెప్టెంబర్ లో నోర్ట్జే చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడాడు. 2024 టీ 20 వరల్డ్ కప్ కు ఎంపికైనా.. అతడికి ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశం లభించలేదు. సౌతాఫ్రికా తరపున ఐదేళ్లలో 19 టెస్టులు,22 వన్డేలు, 42 టీ20 మ్యాచ్ లు ఆడాడు. 

దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్
 
ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో పాటు దక్షిణాఫ్రికా గ్రూప్‌-బిలో ఉంది. ఫిబ్రవరి 21న ఆఫ్ఘనిస్థాన్‌తో టోర్నీ ప్రారంభిస్తుంది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఫిబ్రవరి 25 న ఆస్ట్రేలియాతో.. మార్చి 1 న ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సౌతాఫ్రికా పాకిస్థాన్ వేదికగా ట్రై-సిరీస్‌ ఆడనుంది. ఫిబ్రవరి 10 న న్యూజిలాండ్.. ఫిబ్రవరి 12న పాకిస్తాన్‌లతో తలపడుతుంది. ముక్కోణపు సిరీస్ ఫైనల్ ఫిబ్రవరి 14న జరగనుంది.

Also Read :- ఇలాంటి వార్తలు వింటే నవ్వొస్తుంది.. బెడ్ రెస్ట్ రూమర్లపై బుమ్రా

దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టు: 

టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, వాండెర్ డస్సెన్