మందకృష్ణ మాదిగ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మానుకోవాలి

మందకృష్ణ మాదిగ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మానుకోవాలి
  • తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదు: జి.చెన్నయ్య

బషీర్ బాగ్, వెలుగు: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మానుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి.చెన్నయ్య అన్నారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఎస్సీలలో ఎక్కువగా లబ్ధి పొందింది మాదిగ కులస్తులేనని ఆయన తెలిపారు. గురువారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కో -చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, బేల బాల కిషన్, గోపోజు రమేశ్, బత్తుల రాంప్రసాద్​తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు వర్గీకరణ అంశం తెలంగాణకు వర్తించదన్న విషయాన్ని సీఎం రేవంత్‌‌ గుర్తించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయినప్పటికీ దళితుల స్థితిగతుల అధ్యయనానికి ఉమ్మడి ఏపీ జనాభా లెక్కలు తీసుకుంటామని సీఎం చెప్పడాన్ని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుందని చెన్నయ్య పేర్కొన్నారు. 2014 నుంచి తెలంగాణలో దళితుల స్థితిగతులను అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా.. ఎస్సీల అభివృద్ధికి ఎలాంటి పథకాలు ప్రవేశ పెట్టలేదన్నారు. ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీని రద్దు చేయాలని కోరారు. గురుకుల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేసిన కాలంలో జరిగిన విద్య, ఉద్యోగ పదోన్నతులు, కాంట్రాక్టులపై సీబీఐ విచారణ చేయాలని చెన్నయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంచాల లింగస్వామి, జంగా శ్రీనివాస్, కరణం కిషన్, గుడిమల్ల వినోద్ కుమార్, మన్నె శ్రీరంగా, తాలూకా అనిల్ పాల్గొన్నారు.