మంచిర్యాలలో ఏసీబీ ఆఫీస్ .. ఆదిలాబాద్​నుంచి జిల్లా కేంద్రానికి త్వరలోనే షిఫ్టింగ్

మంచిర్యాలలో ఏసీబీ ఆఫీస్ .. ఆదిలాబాద్​నుంచి జిల్లా కేంద్రానికి త్వరలోనే షిఫ్టింగ్
  • సీసీసీ నస్పూర్​ఓల్ద్​పోలీస్​స్టేషన్​క్వార్టర్​లో ఏర్పాటు
  • కొనసాగుతున్న రిపేర్లు.. వారంలో రోజుల్లో ఓపెనింగ్
  • ఏసీబీ ఆఫీస్​అందుబాటులోకి రావడంతో జనం హర్షం 
  • నిఘా పెరగనుండడంతో అవినీతి ఆఫీసర్లలో బుగులు

మంచిర్యాల, వెలుగు: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆఫీస్​ జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఆదిలాబాద్​లో ఉన్న ఏసీబీ డీఎస్పీ ఆఫీస్​ త్వరలోనే మంచిర్యాలకు షిఫ్ట్ కానుంది. సీసీసీ నస్పూర్​లోని ఓల్డ్​ పోలీస్​ స్టేషన్​కు సంబంధించిన సింగరేణి క్వార్టర్​లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈమేరకు అవసరమైన రిపేర్లు చేపడుతున్నారు. మరో వారం రోజుల్లోనే ఓపెన్​ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులోనే ఓ పక్క భరోసా సెంటర్​ కూడా ఉంది. ఇకమీదట ఇక్కడి నుంచే ఉమ్మడి జిల్లాలో ఏసీబీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. డీఎస్పీ ఆఫీస్​ మంచిర్యాలకు తరలించినప్పటికీ ఆదిలాబాద్​లోని ప్రస్తుత ఆఫీస్​లో కిందిస్థాయి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు. 

దూరాభారంతో ఆఫీసర్లు, సిబ్బంది విముఖత 

ఆదిలాబాద్​లో చాలా సంవత్సరాలుగా ఏసీబీ ఆఫీస్​ఉన్నప్పటికీ 2018లో డీఎస్పీ పోస్టును కేటాయించారు. అప్పటినుంచి చాలాకాలం వరకు ఇన్​చార్జి డీఎస్పీలే కొనసాగారు. ప్రభుత్వం ఇటీవలే రెగ్యులర్​డీఎస్పీని నియమించింది. ప్రస్తుతం డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుళ్లు, మరో నలుగురు హోంగార్డులు పనిచేస్తున్నారు. అయితే దూరాభారం కారణంగా ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్న ఆదిలాబాద్​లో​పనిచేయడానికి ఆఫీసర్లు, సిబ్బంది ఇంట్రెస్ట్​చూపడం లేదని సమాచారం. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్​తో పాటు ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు సరైన ట్రాన్స్​పోర్టేషన్ కనెక్టివిటీ లేకపోవడం.. విద్య, వైద్యం, ఇతర సౌలత్​లు సరిగా లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ క్రమంలో అన్ని వసతులు అందుబాటులో ఉన్న మంచిర్యాలకు ఏసీబీ డీఎస్పీ ఆఫీస్​ను ఫిష్ట్​ చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించగా ఇటీవల గ్రీన్ ​సిగ్నల్​ వచ్చింది.

అవినీతి ఆఫీసర్లలో బుగులు

జిల్లాలోని పలు గవర్నమెంట్​ఆఫీసుల్లో అవినీతి, అక్రమాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఆపీసర్ల చేతులు తడపనిదే ఏ పనీ కావడం లేదన్న ఆరోపణలున్నాయి. సంబంధిత అధికారుల కనుసన్నల్లోనే అమ్యామ్యాల వ్యవహారం నడుస్తోందన్న అభిప్రాయాలను వ్యక్తంమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు డీఎస్పీ ఆఫీస్​ఆదిలాబాద్​లో ఉండడం వల్ల దాదాపు 200 కిలోమీటర్ల దూరం వెళ్లి కంప్లైంట్​ చేయడానికి ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఏసీబీ డీఎస్పీ ఆఫీస్​ మంచిర్యాలలో ఏర్పాటు కానుండడంతో జిల్లాలోని అవినీతి ఆఫీసర్లలో బుగులు మొదలైంది. ఆఫీస్​ చేరువకావడంతో అవినీతిపరులపై ప్రజల నుంచి ఫిర్యాదులు పెరిగే అవకాశం కూడా ఉంది.   

ఉమ్మడి జిల్లాలో ఇక్కడే ఎక్కువ కేసులు

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా పరిధిలో గత కొంతకాలంగా మంచిర్యాలలోనే ఎక్కువ ఏసీబీ కేసులు నమోదవుతున్నాయి. ధరణి పోర్టల్​ రాకముందు భూముల వ్యవహారాలకు సంబంధించి రైతుల నుంచి లంచాలు తీసుకుంటూ పలువురు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. విద్య, వైద్య శాఖల్లో వివిధ పనులు చేసేందుకు పలువురు అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్​హ్యాండెడ్​గా దొరికిన సందర్భాలున్నాయి. బర్త్​, డెత్ ​సర్టిఫికెట్లకు కూడా లంచాలు వసూలు చేస్తున్న అవినీతి చేపల బాగోతాన్ని ఏసీబీ బట్టబయలు చేసింది. 

ఆఫీసుల్లో జీతాల బిల్లులు చేసేందుకు, మున్సిపల్, రెవెన్యూ ఆఫీసుల్లో సేవల కోసం కూడా అమ్యామ్యాలకు కక్కుర్తిపడి ఏసీబీ వలలో చిక్కారు. ఫైర్, పోలీస్‌, మున్సిపల్‌, ఆర్డీవో ఆఫీస్, తహసీల్దార్‌ ఆఫీస్, విద్యుత్‌ శాఖకు చెందిన పలువురు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్​చేసి పట్టుబడ్డారు. ఇరిగేషన్​, పశుసంవర్ధశాఖ, మార్కెటింగ్​ శాఖ డిపార్ట్​మెంట్ల అధికారులు కూడా ఏసీబీకి చిక్కారు.