- కేటీఆర్‌ను మళ్లీ విచారించేందుకు రంగం సిద్ధం
- ఒకట్రెండు రోజుల్లో అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి నోటీసులు
- స్టేట్మెంట్ల ఆధారంగానే క్రాస్ క్వశ్చనింగ్
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని మరోసారి ప్రశ్నించేందుకు ఏసీబీ షెడ్యూల్ ఖరారు చేసింది. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురిని విచారించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని మరో రెండు రోజుల్లో నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్లు, ఏసీబీ సేకరించిన ఆధారాలతో క్రాస్ క్వశ్చనింగ్ చేయనున్నట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలపై ఆరా కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్స్ట్ జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్ ఇచ్చిన స్టేట్ మెంట్లను ఇప్పటికే పరిశీలించారు.
రేస్ నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, రేస్ నుంచి తప్పుకోవడం.. అందుకు దారి తీసిన పరిస్థితుల పూర్తి సమాచారం అనిల్ కుమార్ నుంచి సేకరించారు. అనిల్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్, గతంలో సేకరించిన పత్రాల ఆధారంగా మరోసారి కేటీఆర్‌ను ప్రశ్నించేందుకు ఏసీబీ సన్నద్ధం అవుతున్నది. కాగా, కేటీఆర్ ఆదేశాల మేరకే తాము విధులు నిర్వర్తించామని.. ఏసీబీ విచారణ సందర్భంగా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి తమ స్టేట్మెంట్లలో పేర్కొన్నారు. మంత్రిగా తానే ఆదేశాలు జారీ చేశానని, నిధుల చెల్లింపుల్లో నిబంధనలు పాటించడం అన్నది అధికారులకు సంబంధించిన అంశమని కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.