- 48 గంటల్లోనే ఇన్సులిన్ ఉత్పత్తి మళ్లీ స్టార్ట్
- టైప్1 డయాబెటిస్‌పై ఆస్ట్రేలియా సైంటిస్టుల రీసెర్చ్
- ముగ్గురు వ్యక్తులపై రెండు మందులతో ప్రయోగం సక్సెస్
- బీటా కణాల మాదిరిగా ఇన్సులిన్ స్రవించిన క్లోమ వాహిక
- భవిష్యత్‌లో సహజ పద్ధతిలోనే ఇన్సులిన్ ఉత్పత్తికి చాన్స్
మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా): షుగర్ ప్రాబ్లమ్ ఉన్నోళ్లకు ప్రతి రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం లేదంటే ట్యాబ్లెట్లు వేసుకోవడం వంటి ఇబ్బందులు తప్పిపోనున్నాయి. ఒక్కసారి మందులు వేసుకుంటే చాలు.. డయాబెటిస్ సమస్య పరార్ అయ్యే రోజులు భవిష్యత్తులో రానున్నాయి. టైప్1 డయాబెటిస్ బారిన పడినవారిలో ఇన్సులిన్ తిరిగి ఉత్పత్తి అయ్యేలా చేయడంలో ఆస్ట్రేలియాలోని బేకర్ హార్ట్ అండ్ డయాబెటిస్ సంస్థ సైంటిస్టులు సక్సెస్ అయ్యారు. క్యాన్సర్ ట్రీట్ మెంట్ కు వినియోగించే రెండు మందులతో టైప్ 1 మధుమేహాన్ని ఖతం చేయొచ్చని వారు వెల్లడించారు. ఈ రెండు మందులతో కేవలం 48 గంటల్లోనే క్లోమం(ప్యాంక్రియాస్)లో ఇన్సులిన్ హార్మోన్ సహజసిద్ధంగానే మళ్లీ ఉత్పత్తి అయ్యేలా చేయొచ్చని గుర్తించారు. నేచురల్ గానే ఇన్సులిన్ ఉత్పత్తితో డయాబెటిస్ సమస్యకు చెక్ పెట్టే దిశగా తమ రీసెర్చ్ కీలక ముందడుగుగా నిలుస్తుందని వారు ప్రకటించారు.
క్యాన్సర్ మందులతో ప్రయోగం
యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) ఆమోదం పొందిన జీఎస్కే126, టాజెమెటోస్టాట్ అనే రెండు మందులను సాధారణంగా క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం వినియోగిస్తుంటారు. ఇవి రెండూ కణజాలాల్లోని కణాల పెరుగుదలను అడ్డుకునే ఈజడ్ హెచ్2 అనే ఎంజైమ్ ను కంట్రోల్ చేయడం ద్వారా క్యాన్సర్ నివారణకు పని చేస్తాయి. అయితే,ఈజడ్ హెచ్2 ఎంజైమ్ ను టార్గెట్ చేసుకుంటే.. కణాల పునరుత్పత్తి సాధ్యమని.. క్లోమ వాహిక కణాలను మార్పులకు గురి చేస్తే.. జీర్ణాశయంలో ఎసిడిటీని మేనేజ్ చేయవచ్చని గతంలో సైంటిస్టులు గుర్తించారు. అంతేకాకుండా, సరైన వాతావరణంలో వీటిని బీటా కణాలుగా మార్చే అవకాశం కూడా ఉందని కనుగొన్నారు. కానీ, ఇప్పటివరకూ క్లోమ వాహిక కణాలను బీటా కణాలుగా ఎలా మార్చాలన్నది అంతుచిక్కలేదు. ఈ నేపథ్యంలో రెండు క్యాన్సర్ మందులను ప్రయోగిస్తే.. క్లోమ వాహిక గోడలపై ఉండే కణజాలాలే బీటా కణాలుగా మారి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయని బేకర్ హార్ట్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు తాజాగా కనుగొన్నారు.
టైప్1, టైప్ 2 అంటే..
రక్తంలోని గ్లూకోజ్ (షుగర్) అణువులను శరీర కణాలకు చేర్చేందుకు క్లోమంలోని బీటా కణాలు స్రవించే ఇన్సులిన్ హార్మోన్ అవసరం. అయితే, కొందరి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున క్లోమంలోని బీటా కణాలను నాశనం చేయడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం లేదా పూర్తిగా నిలిచిపోవడం జరుగుతుంది. ఈ సమస్యనే టైప్1 డయాబెటిస్ అంటారు. అలాగే క్లోమంలో ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి కావడంతోపాటు ఆ ఇన్సులిన్ ను శరీర కణాలు స్వీకరించలేని పరిస్థితి తలెత్తడాన్ని టైప్2 డయాబెటిస్ గా చెప్తారు. దీంతో డయాబెటిస్ బాధితులు తమ రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగకుండా చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అవసరమైన మోతాదులో ఇన్సులిన్ ను తీసుకోవాల్సి వస్తోంది.
గ్లూకోజ్ లెవల్స్‌కు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని..
రీసెర్చ్ లో భాగంగా.. టైప్ 1 డయాబెటిస్ సమస్య ఉన్న ఏడేండ్ల బాలుడు, 61 ఏండ్ల వృద్ధుడితోపాటు ఎలాంటి షుగర్ సమస్య లేని 56 ఏండ్ల వ్యక్తిపై సైంటిస్టులు స్టడీ చేశారు. జీఎస్కే126, టాజెమెటోస్టాట్ మందులతో క్లోమ వాహికలోని ప్రోజెనిటర్ సెల్స్ (మూలకణాలు)ను యాక్టివేట్ చేయడంతో వాటిపై ఈజడ్ హెచ్2 ఎంజైమ్ ప్రభావం తగ్గింది. దీంతో ఆ ప్రోజెనిటర్ సెల్స్ బీటా కణాల మాదిరిగా పని చేసేలా మారిపోయాయి. ఇవి ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయడమే కాకుండా.. శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ కు తగ్గట్టుగా తమ పనితీరును అడ్జస్ట్ కూడా చేసుకున్నాయని సైంటిస్టులు గుర్తించారు. దీంతో అన్ని రకాల వయసుల వ్యక్తుల్లోనూ ఈ విధానం అంతే సమర్థంగా పని చేస్తుందని గుర్తించారు. అంతేకాకుండా.. క్లోమ వాహిక ప్రోజెనిటర్ సెల్స్ ను ప్రేరేపించిన తర్వాత కేవలం 48 గంటల్లోనే అవి ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రారంభించాయని కనుగొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మంది బాధితులు
ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. వీరంతా రోజూ షుగర్ లెవల్స్ చెక్ చేసుకుంటూ ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. తమ రీసెర్చ్ తో వీరికి ఇలాంటి బాధలు తప్పనున్నాయని.. అయితే, దీనిపై మరింత విస్తృతస్థాయిలో పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉందని ఆస్ట్రేలియన్ సైంటిస్టులు పేర్కొన్నారు. వీరి రీసెర్చ్ వివరాలు ఇటీవల ‘సిగ్నల్ ట్రాన్స్ డక్షన్ అండ్ టార్గెటెడ్ థెరపీ’ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి.