హనుమకొండ జిల్లా: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అని మండిపడ్డారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ 215వ రోజు హన్మకొండ జిల్లా కమలాపురం మండలం శనిగరం గ్రామంలో ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రం పరకాలకు చేరుకుంది. పరకాలలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన వైఎస్ షర్మిల కేసీఆర్ ప్రభుత్వంతోపాటు స్థానిక ఎమ్మెల్యే పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
వైఎస్ హయాంలో ప్రారంభమైన ఎన్నో సంక్షేమ పథకాలకు బొందపెట్టారని.. 40పథకాలు బంద్ పెట్టి కేవలం రైతుబంధు పేరుతో ఐదు వేలు ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలోనే రైతులు ఆగమయ్యారని మండిపడ్డారు.
కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ పేరు చెప్పి అగ్వకు 12వందల ఎకరాల భూములు గుంజుకున్నరని, 50 లక్షల విలువ చేసే భూమికి కేవలం 10 లక్షలు ఇచ్చారని, మళ్ళీ ఇప్పుడు భూములు కావాలని భయపెడుతున్నరని షర్మిల ఆరోపించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి పేరులో ధర్మం..చేసేది అధర్మం అని విమర్శించారు. తెలంగాణకు సిద్ధాంత కర్త, తెలంగాణకు దిశ దశ చూపించిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ పుట్టిన గడ్డ అక్కంపేటకు ఎన్నో వరాలు ప్రకటించి ఏవీ అమలు చేయలేదన్నారు.
అక్కంపేటను రాష్ట్రంలోనే ఉత్తమ ఆదర్శ గ్రామంగా చేస్తామన్నారని.. కనీసం స్మృతివనం గాని.. గ్రంధాలయంగాని పెట్టలేదన్నారు. అక్కంపేట గ్రామానికి కనీసం తాగునీటి వసతి కూడా లేదని విమర్శించారు. ఈ ఏడాది జనవరిలో అకాల వర్షాలకు 17 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే పట్టించుకోలేదని, కనీసం పరిహారం కూడా చెల్లించలేదన్నారు.