
- ఆదివాసీ సంఘం పేరిట గ్రామాల్లో ప్రత్యక్షం
ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. కర్రెగుట్టలో ఇటీవల జరిగిన పేలుడు ఘటనను ప్రస్తావిస్తూ జిల్లాలోని కౌటాల, బెజ్జూర్, చింతలమానేపల్లి మండలం కర్జవెల్లిలో వాల్ పోస్టర్లు అంటించారు. ‘ఆదివాసీల మీద అప్రకటిత యుద్ధం.. మావోయిస్టులారా తీరవా మీ రక్త దాహాలు, ఇదేనా మీ సిద్ధాంతం? ఇందుకోసమేనా మీ పోరాటం..? అంటూ ఆదివాసీ యువజన సంఘం, తెలంగాణ రాష్ట్రం పేరిట వాల్ పోస్టర్లు అంటించడం కలకలం రేపింది.
విషయం తెలుసుకున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కర్రెగుట్టలో మందుపాతర పేలుడు జరిగి చాలా రోజులు అయిన తరువాత, వాల్ పోస్టర్లు పెట్టి మావోయిస్టులకు సవాల్ విసరడం, మావోయిస్టుల ప్రాబల్యం లేని ప్రాంతాల్లో పోస్టర్లు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది.