గచ్చిబౌలి, వెలుగు : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబరాబాద్ పోలీసులు కలిసి వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.7.17 కోట్ల విలువైన 2,380 కిలోల నార్కోటిక్స్ డ్రగ్స్‌ను అధికారులు బుధవారం దహనం చేశారు. టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు నందిగామ మండలం ఏదులపల్లి గ్రామంలో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో డ్రగ్స్ ను డిస్పోజ్ చేశారు.
డ్రగ్స్ లో 2,286 కిలోల గంజాయి, 354 గ్రాముల గంజాయి మొక్కలు, 48 కిలోల గంజాయి చాక్లెట్లు, 8 లీటర్ల హాష్ ఆయిల్, 87 గ్రాముల ఎండీఎంఏ, 72 గ్రాముల కొకైన్, అల్ఫాజోలం 10 కిలోలు, గంజాయి పౌడర్ 132 గ్రాములు, ఓపియం పప్పీ 1.64 కిలోలు, చరాస్ 26 కిలోలు ఉన్నాయి.
సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్, మేడ్చల్, బాలానగర్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ల పరిధిలోని 31 పోలీస్ స్టేషన్లలో 155 కేసులు నమోదయ్యాయని సైబరాబాద్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, క్రైండీసీపీ నర్సింహా తెలిపారు.