ఆఫ్గనిస్తాన్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాలలో తాలిబన్లు ఆధిపత్యం సాధించారు. అయితే.. కాబూల్ కు 150 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పంజ్ షీర్ పై మాత్రం పట్టు సాధించలేకపోతున్నారు. ఇటీవల తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్న మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలెహ్ కూడా ఇదే ప్రాంతంలో షెల్టర్ తీసుకున్నారు. అలాగే.. రక్షణ మంత్రి బిస్మిల్లా మొహ్మది, మరో నేత అహ్మద్ మసౌది కూడా ఇదే ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడి నుంచి తమ సత్తా చాటుతున్నారు. తాలిబన్లపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ రెబల్ గ్రూప్స్.. రెండు మూడు చోట్ల తాలిబన్లను హత్యచేసి.. ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. దీంతో పంజ్ షీర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు తాలిబన్లు.
ఇప్పటికే తమ ఫైటర్లు వేలాది మంది పంజ్ షీర్ ను చుట్టుముట్టారని తాలిబన్లు ప్రకటించారు. పంజ్ షీర్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఇస్లామిక్ ఎమిరేట్స్ కు చెందిన ముజాహిదిన్ లు దానిని చుట్టుముట్టారని చెప్పారు. అయితే స్థానికంగా ఉన్న అధికారులు.. రాష్ట్రాన్ని తాలిబన్లకు అప్పగించేందుకు నిరాకరించడంతో.. తాలిబన్లకు, రెబల్స్ కు మధ్య ఎదురుదాడి మొదలైంది.
తాలిబన్లను ఎదుర్కునేందుకు పంజ్ షీర్ వారియర్లు రెడీ అవుతున్నారు. అహ్మద్ మసౌది నేతృత్వంలో స్థానిక యువతకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆఫ్గనిస్తాన్ లోని పలు ప్రాంతాల నుంచి గత ప్రభుత్వ హయంలోని పనిచేసిన బలగాలు.. పంజ్ షీర్ చేరుకుంటున్నాయి. తాలిబన్లను ఎదుర్కునేందుకు ఆయుధాలు సమకూర్చుకుంటున్నాయి. తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ లో ఎక్కువ రోజులు ఉండబోరని రెబల్ లీడర్స్ అంటున్నారు. వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.