Nag Mark 2: నాగ్‌ మార్క్‌-2 క్షిపణి పరీక్ష సక్సెస్

డీఆర్డీఓ(DRDO)పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మూడో తరం ట్యాంక్‌ విధ్వంసక గైడెడ్‌ క్షిపణి నాగ్‌ మార్క్‌-2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఇందుకు వేదికైంది. పోఖ్రాన్‌ ఫైరింగ్ రేంజ్‌లో సీనియర్ ఆర్మీ అధికారుల సమక్షంలో ఈ పరీక్షలు నిర్వహించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇది మూడోతరం 'యాంటీ-ట్యాంక్ ఫైర్-అండ్-ఫర్గెట్ గైడెడ్ మిస్సైల్'. లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో చేధించగలదు. మొత్తం మూడు ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించగా.. క్షిపణి గరిష్ట, కనిష్ట పరిధిలోని అన్ని లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. అలాగే 'నాగ్ మిస్సైల్ క్యారియర్' (వెర్షన్ 2) క్షిపణిని పరీక్షించినట్లు వెల్లడించింది. ఈ పరీక్షలతో నాగ్‌ ఆయుధ వ్యవస్థ మొత్తం.. భారత సైన్యంలో ప్రవేశించేందుకు సిద్ధమైంది అని రక్షణ మంత్రిత్వశాఖ ఒక పేర్కొంది.

ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) శాస్త్రవేత్తలను అభినందించారు.