న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలో నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీని తీసుకురానుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. టెర్రరిజానికి బార్డర్లు ఉండవు కాబట్టి, దానిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీ ఏజెన్సీలు కలిసి పనిచేయాలని సూచించారు. గురువారం ఢిల్లీలో యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్లో షా మాట్లాడారు.
“రాష్ట్రాలు, యూటీల కోసం యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) మోడల్స్ తో ఈ కొత్త పాలసీ ఉంటుంది. టెర్రరిజాన్ని ఎదుర్కోవడానికి ఇది ఉమ్మడి వేదికగా పని చేస్తుంది. ఏటీఎస్, ఎస్టీఎఫ్ మోడల్స్ రాష్ట్రాల హక్కులను తగ్గించవు”అని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గత పదేండ్లలో టెర్రరిజం ఘటనలు 70 శాతం తగ్గాయని చెప్పారు. టెర్రరిజం కట్టడికి అన్ని రాష్ట్రాలు సమన్వయంతో పని చేయాలన్నారు.