అహ్మదాబాద్: గుజరాత్‌లో నలుగురు ఐఎస్ టెర్రరిస్టులను యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్) బృందం పట్టుకుంది. ఇంటలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సోమవారం ఆపరేషన్ నిర్వహించారు. ఆ నలుగురు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు రాగా అరెస్ట్ చేశారు. వీళ్లు శ్రీలంక నుంచి చెన్నై మీదుగా అహ్మదాబాద్‌కు చేరుకున్నారని పోలీసులు తెలిపారు. వాళ్లదగ్గరున్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించగా, అందులో ఎన్క్రిప్టెడ్ చాటింగ్ ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీరిని శ్రీలంకకు చెందినవారుగా భావిస్తున్నామన్నారు.
అయితే, వీళ్లు అహ్మదాబాద్‌కు ఎందుకు వచ్చారు? అక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నారనే విషయాల గురించి నిందితులను విచారిస్తున్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ ఎయిర్‌పోర్టుకు కొద్దిరోజులకింద వచ్చిన బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఎయిర్పోర్టంతా జల్లెడ పట్టి అది ఫేక్ కాల్ అని తేల్చారు. కొద్దిరోజుల తర్వాత ఐఎస్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న నలుగురు పట్టుబడటం కలకలం రేపుతోంది.