
వక్ఫ్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా బెంగాల్లో భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతుండగా..తాజాగా అవి అసోంకు అంటుకున్నాయి. ఆదివారం (ఏప్రిల్ 13) అసోంలోని సిల్చార్ లో హింస చెలరేగింది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఆందోళనకారులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు.మూకలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సిల్చార్ లో దాదాపు 400 మంది నిరసనలు చేపట్టారు. ఇటీవల అమలులోకి వచ్చిన చట్టాన్ని నిరసిస్తూ సిల్చార్ లోని బెరెంగా ప్రాంతంలో వందలాది మంది ఎటువంటి అనుమతి లేకుండా వీధుల్లోకి వచ్చారని పోలీసులు తెలిపారు. సుమారు 300నుంచి -400 మంది రోడ్డును దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. నిరసనకారులు నల్ల జెండాలు ప్రదర్శించి, బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళన కారులను క్లియర్ చేసే క్రమంలో వారిలో కొందరు పోలీసులపై రాళ్ళు రువ్వారు. జనసమూహాన్ని చెదరగొట్టడానికి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అసోం లో హింసాకాండ ప్రభావిత ప్రాంతాలలో సిల్చార్‌లోని చమ్రగుడం, బెరెంగా, పాత లఖిపూర్ రోడ్ ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని, ఈ ప్రాంతాల్లో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు.