IPL 2024: ఆర్సీబీను నిలబెట్టిన రావత్, కార్తీక్.. చెన్నై ముందు ఛాలెంజింగ్ టార్గెట్

IPL 2024: ఆర్సీబీను నిలబెట్టిన రావత్, కార్తీక్.. చెన్నై ముందు ఛాలెంజింగ్ టార్గెట్

ఐపీఎల్ తొలి మ్యాచ్ లో బెంగళూరు తడబడి కోలుకుంది. మొదట కష్టాల్లో పడినా ఆ తర్వాత కోలుకొని డీసెంట్ టోటల్ బోర్డు మీద ఉంచింది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 173 పరుగుల స్కోర్ చేసింది. యువ బ్యాటర్ అనుజ్ రావత్ తో పాటు సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తిక్ జట్టును ఆదుకున్నారు. రావత్ 48 పరుగులతో  అదరగొడితే, కార్తీక్ (38) తనదైన స్టయిల్లో ఇన్నింగ్స్ ఫినిష్ చేశాడు.   
     
78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఈ జోడీ నిలబెట్టింది. మొదట ఆచితూచి ఆడిన వీరిద్దరూ క్రమంగా బ్యాట్ ఝళిపించి చెన్నై జట్టుకు చుక్కలు చూపించారు. వీరిద్దకు ఆరో వికెట్ కు అజేయంగా 50 బంతుల్లోనే ఏకంగా 95 పరుగులు జోడించడం విశేషం. బెంగళూరు ఇన్నింగ్స్ లో ఏదైనా హైలెట్ ఉందంటే అది వీరిద్దరి భాగస్వామ్యమే అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టుకు డుప్లెసిస్, కోహ్లీ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. 

ఓ వైపు  కోహ్లీ డిఫెన్స్ ఆడుతుంటే డుప్లెసిస్ మాత్రం చెలరేగిపోయాడు. వచ్చిన ప్రతి బౌలర్ పై విజృంభించాడు. డుప్లెసిస్ మొత్తం 23 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అందులో 8 ఫోర్లు ఉన్నాయి. తొలి నాలుగు ఓవర్లలో 37 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా వెళ్లినట్టు కనిపించింది. అయితే ఐదో ఓవర్లో ముస్తాఫిజుర్ రెహమాన్ మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి బెంగళూరు జట్టుకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ 78 పరుగులకే సగం జట్టును కోల్పోయింది. చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ కు నాలుగు వికెట్లు దక్కాయి. చాహర్ ఒక వికెట్ తీసుకున్నాడు.