- సీఎంకు ఆకునూరి మురళి విజ్ఞప్తి
- కమిషనర్ రంగనాథ్ బాగా పనిచేస్తున్నారని ప్రశంస
హైదరాబాద్, వెలుగు: హైడ్రా కూల్చివేతలపై ప్రజా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ఏ మాత్రం తగ్గకుండా దూకుడుగా వ్యవహరిస్తున్న ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీ ‘ఎక్స్’లో ప్రశంసించారు. ‘‘మంచి పని చేస్తున్నారు. శబాష్ రంగనాథ్.. గో అహెడ్.. మన ప్రజా ప్రతినిధులు చాలా మంది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా అడ్డగోలుగా ప్రభుత్వ, చెరువు శిఖం భూములను ఆక్రమిస్తున్నారు.
గత పాలకులు మేము తింటాం.. మీరు తినండి.. అని అందరిని దొంగలుగా మార్చారు. రూ.లక్షల కోట్ల విలువైన భూములను, ప్రాణాలను రక్షించే చెరువులను కాపాడుకోవాలి. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలి. సీఎం హైడ్రాని ఇంకా బలోపేతం చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించండి. ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడండి. రంగనాథ్‌కు పూర్తి ప్రోత్సాహాన్ని ఇవ్వండి”అని గురువారం ‘ఎక్స్’లో తెలంగాణ సీఎంవో, డీజీపీని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ‘రంగనాథ్.. మనం డ్యూటీలో పారదర్శకంగా ఉండడమే కాదు.. ఉన్నట్టు కూడా కనిపించాలి. ఇది అడ్మినిస్ట్రేటివ్ సలహా’’అంటూ ఆకునూరి సలహా ఇచ్చారు.