టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి: అనుముల సురేశ్

నల్గొండ అర్బన్, కొండమల్లేపల్లి, వెలుగు: టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ లో భారీ ర్యాలీ నిర్వహించి టీఎస్‌పీఎస్సీ చైర్మన్​ జనార్దన్​రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయమే జరిగిందని వాపోయారు.  

గ్రూప్-1 పరీక్ష రెండుసార్లు నిర్వహించినా.. ప్రభుత్వ పారదర్శకత పాటించకపోవడంతో మళ్లీ రద్దు అయ్యిందన్నారు.  టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేసి కొత్త బోర్డు ద్వారా ఎగ్జామ్‌ పెట్టాలని, ప్రతి నిరుద్యోగికి రూ.1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలోని క్రాంతి జూనియర్ కాలేజీలో  నిర్వహించిన కార్యక్రమంలో ‘నిరుద్యోగుల పట్ల టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యం’ అంశం పై యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కలమురి పరుశురాం మాట్లాడారు. 

ALSO READ : హైకోర్టుకు హాజరైన మంత్రి శ్రీనివాస్గౌడ్..

టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వాపోయారు.  లక్షల రూపాయలు హాస్టళ్లు, కోచింగ్‌ సెంటర్లు, పుస్తకాలకే పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండలో రేణుక, మౌనిక, కోట క్రాంతి, వినోద్ చారీ, క్రాంతి కుమార్, కిరణ్, సైదులు, విక్రమ్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.