కొలంబో: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే(56) ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ప్రెసిడెన్షియల్ సెక్రటేరియెట్‌లో చీఫ్ జస్టిస్ జయంత జయసూర్య ఆయనతో ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన తొలి ప్రసంగం చేశారు. "ప్రజాతీర్పును గౌరవించి శాంతియుతంగాఅధికార మార్పిడి చేసిన మాజీ ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘేకు కృతజ్ఞతలు. పదవిలో ఉన్నన్ని రోజులు ప్రజాస్వామ్య పరిరక్షణకు నా వంతు కృషి చేస్తా.
రాజకీయ నాయకుల ప్రవర్తనపై ప్రజలకున్న అపనమ్మకాన్ని పోగొట్టి, వారి గౌరవాన్ని పునరుద్ధరించడానికి పనిచేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇకపై శ్రీలంక ఒంటరిగా ఉండదు. వివిధ దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తుంది.
దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఇప్పటికిప్పుడు దాన్ని సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేయటానికి నేనేమీ మాంత్రికుడిని కాదు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో నుంచి బయటపడేయటానికి ప్రజలందరి సహకారం చాలా అవసరం.
ప్రతిఒక్కరూ సహకరించేలా చూడటమే నా లక్ష్యం. ఈ దేశానికి మళ్లీ ప్రాణం పోసేలా కొత్త శకానికి నాంది పలికేందుకు నా బాధ్యతను నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నాను" అని దిసనాయకే పేర్కొన్నారు.
అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత తనకు అభినందనలు తెలిపిన భారత ప్రధాని మోదీకి దిసనాయకే ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
దినేశ్ గుణవర్దన రాజీనామా
ప్రధాన మంత్రి దినేశ్ గుణవర్దన(75) సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిసనాయకే గెలుపొందినందున అధికార మార్పిడిలో భాగంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
శ్రీలంక కొత్త కేబినెట్ శాంతియుతంగా ఏర్పడేందుకు తన వంతు సహకారం చేస్తానని చెప్పారు. ఈమేరకు దిసనాయకేకు గుణవర్దన లేఖ రాశారు.