య్యూటబర్​ : ట్యూమర్​ని జయించి రైడర్​గా..

య్యూటబర్​ : ట్యూమర్​ని జయించి  రైడర్​గా..

బైక్​ నడపడం అంటే అతనికి చాలా ఇష్టం. కానీ.. బతకాలంటే డబ్బు కావాలి. బైక్​ రైడ్స్​ చేస్తే డబ్బు ఖర్చవుతుంది!  కానీ.. సంపాదించలేం అనుకుని.. తండ్రిలా టీచర్​ కావాలి అనుకున్నాడు. అప్పుడే  యూట్యూబ్​ వల్ల అతనికి నచ్చిన పని చేస్తూనే డబ్బు సంపాదించుకునే అవకాశం వచ్చింది. మోటో వ్లాగ్స్​ చేయడం మొదలుపెట్టాడు. అతను మాట్లాడే విధానం, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులను వివరించే పద్ధతి అందరికీ నచ్చాయి. అందుకే ఫేమస్​ యూట్యూబర్​ అయ్యాడు. ఇప్పుడు బైక్​ రైడ్స్​, వ్లాగ్స్​ చేస్తూనే లక్షల్లో సంపాదిస్తున్నాడు. 

అనురాగ్ దోభాల్.. యూట్యూబ్ ప్రపంచంలో అతని చానెల్​ పేరు ‘‘ది యూకే07 రైడర్’’తో గుర్తింపు పొందాడు. అతను ఇండియాలోని టాప్​ మోటో వ్లాగర్స్​లో ముందువరుసలో ఉంటాడు. అనురాగ్​ రెగ్యులర్​గా కార్​ ట్రిప్స్​, బైక్ రైడ్స్​, అడ్వెంచర్స్​తోపాటు వ్లాగ్స్​ని యూట్యూబ్​లో అప్​లోడ్ చేస్తున్నాడు. అతని వీడియోలకు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అభిమానులు ఉన్నారు. 

ఆరేళ్ల వయసులో.. 

అనురాగ్ దోభాల్ 1997 సెప్టెంబర్ 18న ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లోని డెహ్రాదూన్‌‌‌‌‌‌‌‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. తండ్రి జగదాంబ ప్రసాద్ దోభాల్ కాలేజీ లెక్చరర్​. తల్లి అతుల్ దోభాల్ ఇంటిని చూసుకునేది. అనురాగ్​ అనారోగ్యం వల్ల చిన్నప్పటినుంచే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతనికి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు చెప్పారు. 

అసలే వాళ్లది మధ్య తరగతి కుటుంబం కావడంతో ట్రీట్​మెంట్​ చేయించడానికి ఆర్థికంగా చాలా ఇబ్బుందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్ని సమస్యలు ఎదురైనా అతని తల్లిదండ్రులు అనురాగ్​ని కాపాడుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ట్రీట్​మెంట్​ ఇప్పించారు. పూర్తిగా కోలుకునే టైంకి తన వయసు 14 ఏళ్లు. అప్పుడు ఎదుర్కొన్న సవాళ్లే అనురాగ్​కు ధైర్యం, పట్టుదలను నేర్పాయి.

టీచర్​ కావాలనుకుని.. 

అనురాగ్​ స్కూల్​ ఎడ్యుకేషన్ డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌లోని ది ఏషియన్ స్కూల్‌‌‌‌‌‌‌‌లో పూర్తయ్యింది. ఆ తర్వాత పై చదువుల కోసం హేమవతి నందన్ బహుగుణ గర్హ్వాల్ యూనివర్సిటీలో చేరాడు. అతనికి చిన్నప్పటి నుంచి బైక్‌‌‌‌‌‌‌‌లు నడపడమంటే ఇష్టం. దాంతోపాటు తన తండ్రిలాగే టీచర్​ కావాలని కలలు కన్నాడు. అందుకే 2014లో ట్యూషన్ టీచర్‌‌‌‌‌‌‌‌గా పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. కానీ.. 2018లో అతని జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది. దాంతో టీచింగ్​ కెరీర్​కు ఫుల్​స్టాప్​ పెట్టి, రైడర్​గా జీవితాన్ని ప్రారంభించాడు. 

యూట్యూబ్ ప్రయాణం

అనురాగ్​ 2015లోనే ‘ది యూకే 07 రైడర్’​ పేరుతో యూట్యూబ్​ చానెల్  పెట్టినప్పటికీ 2018 నుంచి వీడియోలు అప్​లోడ్​ చేస్తూ.. యాక్టివ్​గా ఉంటున్నాడు. జనవరి 1న అనురాగ్ మొదటి వీడియోని పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. అదే నెల 14వ తేది నాటికి సబ్​స్క్రయిబర్ల సంఖ్య 100కి చేరింది. ఆ తర్వాత ప్రతినెలా పెరుగుతూ వచ్చింది. మరుసటి సంవత్సరం ఆ సంఖ్య లక్ష దాటింది. 

అనురాగ్​ తన కేటీఎం బైక్​తో దేశవ్యాప్తంగా రైడ్స్​ చేస్తుంటాడు. ఆ ప్రయాణాలను వీడియో తీసి యూట్యూబ్​లో అప్​లోడ్​ చేస్తాడు. అతని మొదటి వీడియోలో ఉత్తరాఖండ్​ అందాలను చూపించాడు. అయితే.. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లోని కర్తార్‌‌‌‌‌‌‌‌పూర్ కారిడార్‌‌‌‌‌‌‌‌ రైడ్​ వీడియోతో చాలా గుర్తింపు వచ్చింది. ఆ వీడియో వైరల్​ కావడంతోపాటు చానెల్​కు చాలామంది సబ్​​స్క్రయిబర్లను తీసుకొచ్చింది. 

బ్రో సేన

అనురాగ్ తన ఫాలోవర్స్​ని ‘‘బ్రో సేన” అని పిలుస్తుంటాడు. వాళ్లలో చాలామంది అతన్ని ఎంతగానో అభిమానిస్తున్నారు. అందుకే కొంతమంది డబ్బు చెల్లించి మరీ చానెల్​లో జాయిన్​ అయ్యారు. ప్రస్తుతం చానెల్‌‌‌‌‌‌‌‌ను 7.84 మిలియన్ల మంది సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు. చానెల్​లో ఇప్పటివరకు 11 వందల వీడియోలు అప్​లోడ్​ చేశాడు. మరో ప్రత్యేకత ఏంటంటే.. సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్స్​ అందరూ షార్ట్‌‌‌‌‌‌‌‌ వీడియోలతో పాపులర్​ అవుతుంటే అనురాగ్​ మాత్రం ఇప్పటివరకు ఒక్క షార్ట్ వీడియో కూడా యూట్యూబ్​లో అప్​లోడ్​ చేయలేదు. 

ఫ్యామిలీ వ్లాగ్స్​ అప్​లోడ్​ చేసేందుకు ‘బాబు భయ్యా’ పేరుతో రెండో చానెల్​ కూడా పెట్టాడు. దాన్ని ఇప్పటివరకు 4.13 లక్షల మంది సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు. ఈ రెండు చానెళ్ల నుంచి, బ్రాండ్ స్పాన్సర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ల ద్వారా అతనికి ఆదాయం వస్తోంది. అతని ఆస్తుల విలువ మూడు కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందనేది ఒక అంచనా. లంబోర్ఘిని, సుప్రా లాంటి లగ్జరీ కార్లను వాడుతున్నారు అనురాగ్​. 2023లో అతనికి ‘‘క్రియేటర్స్ ఫర్ గుడ్”అనే  అవార్డు కూడా దక్కింది. 

బిగ్​బాస్​ షో

అనురాగ్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అతనికి నేపాల్​ రైడ్​లో పరిచయమైన సవ్య అనే రైడర్​తో ప్రేమలో పడ్డాడు. కానీ.. కొన్నాళ్లకు వాళ్లు విడిపోయారు. ఆ బాధ నుంచి కోలుకునేలోపే 2023లో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్–17కి సెలక్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. అందులో కూడా అతనికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. 

అతన్ని అన్యాయంగా ఎలిమినేట్​ చేశారని ఆరోపణలు చేశాడు. ఆ షో తర్వాత మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాడు. అయినప్పటికీ కుటుంబం, ఫాలోవర్స్​ సపోర్ట్‌‌‌‌‌‌‌‌తో నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం అనురాగ్​కు రితికా చౌహాన్‌‌‌‌‌‌‌‌ అనే  అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది.