కేసీఆర్ పాలన అంతా అవినీతిమయం : అనురాగ్ సింగ్ ఠాగూర్

కేసీఆర్ పాలన అంతా అవినీతిమయం : అనురాగ్ సింగ్  ఠాగూర్

సిద్దిపేట, వెలుగు : సీఎం కేసీఆర్  పదేండ్ల పాలన అంతా అవినీతిమయమని, కాళేశ్వరం పేరుతో  కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని కేంద్ర మంత్రి అనురాగ్  సింగ్   ఠాకూర్  విమర్శించారు. సిద్దిపేట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డికి మద్దతుగా సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చి ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులను కేసీఆర్  మోసం చేశారని, అలాగే బీఆర్ఎస్  కార్యకర్తలకు మాత్రమే దళితబంధు ఇచ్చారని మండిపడ్డారు. 

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు పేరుచెప్పి సీఎం కేసీఆర్  లక్షల కోట్లు దోచుకున్నడు. అయినా కూడా ప్రాజెక్టు నిర్మించడంలో ఆయన ఫెయిలైండు. సర్దార్  వల్లభాయ్  పటేల్  వల్లే తెలంగాణ కు విముక్తి లభించింది. నేటి రజాకార్లైన బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్  పార్టీల నుంచి రాష్ట్రానికి విముక్తి కలగాలంటే బీజేపీని గెలిపించాలి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే పెట్రోల్, డీజిల్  ధరలు తగ్గిస్తం. డిగ్రీ చదివే విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందిస్తం” అని అనురాగ్  హామీ ఇచ్చారు. 

ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట బీజెపీ అభ్యర్థి శ్రీకాంత్  రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేటలో రావణాసురుడికి, రామదండుకు మధ్య పోటీ జరుగుతున్నదన్నారు. కేసీఆర్  కుటుంబ  కబందహస్తాల నుంచి  సిద్దిపేటకు త్వరలోనే విముక్తి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాంచంద్రారావు, విద్యాసాగర్, రాంచంద్రారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.