- రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు: ఐక్య పోరాటాలతోనే పసుపు బోర్డు ఏర్పాటైందని, ఇందులో అందరి పాత్ర ఉందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ లో ఆదివారం రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతు జేఏసీ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీలకు సంబంధం లేకుండా పోరాటం చేయడంతోనే నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు వచ్చిందన్నారు.
.పసుపు బోర్డుకు ఈ ప్రాంత వ్యక్తిని చైర్మన్ గా నియమించడం స్వాగతించాల్సిన విషయమేనన్నారు. పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి నిధులు కేటాయించాలని కోరారు. అప్పుడే రైతులకు మేలు జరుగుతుందన్నారు. పసుపు పంటకు క్వింటాలుకు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతు జేఏసీ నేతలు వి.ప్రభాకర్, దేగాం యాదాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, జక్కలింగారెడ్డి, మహేంధర్ రెడ్డి, బి.దేవరాం, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.