చంపినోడే సంతాప సభ పెట్టినట్టుంది

చంపినోడే సంతాప సభ పెట్టినట్టుంది
  • బీఆర్​ఎస్​పై అన్వేశ్​​ రెడ్డి ఫైర్​

హైదరాబాద్, వెలుగు: రైతు సమస్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ వేయడాన్ని రాష్ట్ర సీడ్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తప్పుపట్టారు. బీఆర్ఎస్ తీరు చూస్తే చంపినోడే సంతాప సభ పెట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైత సమస్యలపై బీఆర్ఎస్ వేసిన ఈ కమిటీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప, వారి సంక్షేమం కోసం కాదని తెలిపారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని చెప్పారు.

 బీఆర్ఎస్ పాలనలో సగటున ప్రతిరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అసమర్థ పాలనకు మరింకేం నిదర్శనం కావాలన్నారు. పదేండ్ల పాటు అధికారం అనుభవించిన పార్టీ అప్పుడు రైతుల సంక్షేమం, వారి సమస్యలపై అధ్యయనం కోసం ఏనాడు కమిటీ వేసిన పాపాన పోలేదని పేర్కొన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీపరంగా కమిటీ వేయడం అనేది కేవలం రైతులను మభ్యపెట్టేందుకేనని ఆరోపించారు.