దేశ రక్షణ కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అక్రమం కాదు: ట్రంప్​

దేశ రక్షణ కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అక్రమం కాదు: ట్రంప్​
  • అది చట్టాన్ని ఉల్లంఘించడం కాదు

వాషింగ్టన్: ఒక వ్యక్తి తన దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నా, చట్టాలను ఉల్లంఘించినట్టు కాదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అయింది. రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ట్రంప్ వరుసగా అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేయగా, వాటిపై డజన్లకొద్దీ న్యాయవివాదాలు తెలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ట్రూత్ సోషల్ లో తన చర్యలను సమర్థించుకుంటూ ఈ పోస్ట్ చేశారు. 

‘‘తన దేశ రక్షణ కోసం ఒక వ్యక్తి ఏం చేసినా, చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదు” అంటూ గతంలో ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ తరచూ చెప్పేవారు. తాజాగా ట్రంప్ కూడా నెపోలియన్ కోట్ ను పోస్ట్ చేస్తూ పరోక్షంగా తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను సమర్థించుకున్నారు. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన వెంటనే క్యాపిటల్ హిల్ పై దాడి కేసులో తన మద్దతుదారులకు క్షమాభిక్ష పెట్టేందుకు, అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపేందుకు, ఆర్మీలో ట్రాన్స్ జెండర్లను నిషేధించేందుకు, ఫెడరల్ గవర్నమెంట్ లో వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు, యూఎస్ ఎయిడ్ సంస్థకు నిధులు నిలిపివేసేందుకు వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. 

అమెరికన్ కాంగ్రెస్ కు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను కూడా ట్రంప్ ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం, యూఎస్ ఎయిడ్ కు నిధులు నిలిపేయడం వంటి చర్యలపై దేశంలోని అనేక కోర్టుల్లో లా సూట్లు ఫైల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన పోస్ట్ చర్చనీయాంశం అయింది. అయితే, ట్రంప్ పై ఎప్పుడూ తీవ్రంగా మండిపడే కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రటిక్ పార్టీ సెనెటర్ ఆడమ్ షిఫ్ ఈసారి కూడా ఘాటుగా స్పందించారు.

 ‘ట్రంప్ ఇప్పుడు నిజమైన నియంతలా మాట్లాడుతున్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ట్రంప్ అనుచరులు సోషల్ మీడియాలో జడ్జిలపై కూడా దాడి చేస్తున్నారని, వారిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సైతం.. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు ఉన్న అధికారాలను జడ్జిలు నియంత్రించడాన్ని అంగీకరించబోమని ట్వీట్ చేశారు.