వ్యవస్థను చక్కబెట్టాలి కానీ, ప్రైవేటుకు ఇచ్చుడు మంచిది కాదు

‘ప్రైవేటువాళ్లకిస్తే తప్పేంది?’ అని వెలుగులో గుండోజు శ్రీనివాస్​ వ్యాసం రాశారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని పబ్లిక్​ సంస్థను ఏర్పాటు చేసుకుంటే, దాని నష్టాలను బూచిగా చూపించి ప్రైవేటుపరం చేయడమంటే.. పెండ్లి అనే వ్యవస్థ ద్వారా భార్యను తెచ్చుకుని, సంసార సుఖాలు అనుభవించి, వంశాభివృద్ధిలో భాగంగా పిల్లల్ని కని, చిన్న పొరపొచ్చాలు వచ్చాయని భార్యను వదిలించుకున్నట్టుగా ఉంది.  సమస్యలు వస్తే ఆ వ్యవస్థను చక్కబెట్టాలేగానీ, ప్రైవేటుకు ఇవ్వడం సరికాదు. 

పన్నుల రూపంలో సర్కారుకు ఆదాయం

విశాఖ స్టీల్​ ప్లాంట్​నే తీసుకుందాం.. ఈ పరిశ్రమ బీజేపీ పుట్టకముందే ఏర్పాటైంది. ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్ల(నేను కూడా దీనిలో భాగస్తుడిని) పోరాటంతో మొదలైంది. తర్వాత రాజకీయ నాయకులు, ఇతరుల పోరాటాల ఫలితంగా ఈ సంస్థ ఆవిర్భవించింది. కాలక్రమేణ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ సంస్థ ద్వారా ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు లాభం చేకూరింది. కానీ దీనికి సొంత గనులు మాత్రం ఇవ్వలేదు. ఇది నష్టాల్లో ఉంటే గట్టెక్కించాలేకానీ, ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలనుకోవడం దుర్మార్గమే. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. కరోనా మొదటి దశలో రిలయన్స్​ ఇండస్ట్రీస్​ షేరు లక్షల కోట్లలో పడిపోయింది. దీంతో ఆగమేఘాల మీద ఎఫ్​డీఐ పరిమితిని పెంచి అంబానీని ప్రపంచ ధనవంతుల్లో 4వ వాడిగా చేశారు. ఇదంతా కొన్ని నెలల్లోనే జరిగింది. అంతేకాదు సర్దార్​ పటేల్​ విగ్రహాన్ని కొన్ని వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించారు. దీనిని చూసే వారిని రప్పించేందుకు వేల కోట్లు ఖర్చు చేసి రైల్​ మార్గాలను వివిధ రాష్ట్రాల నుంచి ఏర్పాటు చేశారు. లక్షల కోట్లు ఖర్చు చేసి గుజరాత్​లో ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతేకాదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కోట్లు పంచి గెలవాలని చూస్తున్నారు. ఇతర పార్టీలున్న రాష్ట్రాలను గుంజుకుంటున్నారు.

అవినీతిని అరికట్టడం కాదు.. ప్రోత్సహిస్తోంది

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటువాళ్లకు ఇవ్వడం ఎప్పటి నుంచో జరుగుతోందని చెబుతున్నారు. కానీ, ప్రభుత్వ రంగ ప్రముఖ సంస్థలను స్వాతంత్ర్యం తర్వాత ఏర్పాటు చేసింది కాంగ్రెస్​ ప్రభుత్వాలే అనే విషయాన్ని మరిచిపోయారు. వీటి ద్వారా కోట్ల మందికి ఉపాధి కలిగింది. ఇందిరాగాంధీ బ్యాంకింగ్​ వ్యవస్థను ప్రైవేటు నుంచి ప్రభుత్వరంగ సంస్థలుగా మార్చితే, ప్రభుత్వ సంస్థలను బీజేపీ తస్మదీయులకు అప్పగిస్తోంది. ప్రజలు చెల్లించిన పన్నులతో ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు పూడుస్తున్నారని, అవినీతికి అవి పునాది అని అంటున్నారు. అవినీతి జరుగుతోందనేనా ఢిల్లీని ఎల్​జీ చేతికిచ్చి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పంచాయతీ వ్యవస్థగా మార్చారు. ఇది రాజకీయ లబ్ధి కోసం కాదా? బీజేపీ ప్రభుత్వం అవినీతిని అరికడతామని చెప్పి, అవినీతిని పెంచి పోషిస్తోంది. అందుకే అన్ని పార్టీల నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అవినీతిని అరికట్టే క్రమంలో ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా అవినీతిని ప్రోత్సహిస్తోంది. ఉదాహరణకు రియల్​ఎస్టేట్​ ద్వారా నల్లధనం తెల్లధనంగా మారుతున్నది. ఇలా మారకుండా చేయడం ద్వారా అవినీతిని అరికట్టవచ్చు. కానీ, బీజేపీ ప్రభుత్వం ఎక్కడా ఇలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. పైగా దేశాన్ని ప్రైవేటు వారికి అమ్ముకుంటోంది. ప్రైవేటు వ్యక్తులు లక్షలాది మంది సొంత మేథతో పైకి వచ్చారు. వస్తున్నారు. ఇది నిజాయితీ అభివృద్ధి. నేను నా స్వశక్తితో నెలకు రూ.500 నుంచి రూ.5,00,000(టాక్స్​ ఫ్రీ శాలరీ) స్థాయికి ఎదిగినా, ఇప్పుడు సొంత గూడు కూడా లేదు. ఎందుకంటే ఎన్డీయే ప్రభుత్వం వ్యాపారుల కోసం వడ్డీ రేట్లు తగ్గించడం మూలంగా, ఆదాయం(బ్యాంకు వడ్డీల ద్వారా) సగానికి సగం తగ్గిపోయింది. దీని నుంచి బయటపడటానికి ఉన్న గూడు(1984లో నిర్మించుకున్నది)ను కూడా అమ్మి బ్యాంకులో పెట్టుకోవడం జరిగింది. అంటే బీజేపీ ప్రభుత్వం మాలాంటి వారి పొట్టకొట్టి ఉన్నవారికి దోచిపెడుతోందన్న మాట.
- డాక్టర్​ సజ్జల జీవానందరెడ్డి,
మాజీ ముఖ్య సాంకేతిక సలహాదారుడు,
ప్రపంచ వాతావరణ సంస్థ