
- దాన్ని అంతానికి న్యూజిలాండ్‌తో కలిసి పనిచేస్తం: ప్రధాని మోదీ
- క్రిస్టోఫర్ లక్సన్ తో ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వంటి అనేక రంగాలలో ఆరు ఒప్పందాలు
న్యూఢిల్లీ: టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా ఆమోదయోగ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. టెర్రర్ అటాక్స్ కు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు అవసరమన్నారు. 2019లో క్రైస్ట్‌చర్చ్ సిటీపై జరిగిన ఉగ్రవాద దాడి అయినా, 26/11 ముంబై దాడి అయినా తమ వైఖరి ఒక్కటేనని చెప్పారు.
టెర్రరిస్టులకు, వేర్పాటువాదులకు, రాడికల్స్ కు వ్యతిరేకంగా న్యూజిలాండ్ చేసే పోరాటానికి తమ సహకారం కొనసాగిస్తామని వెల్లడించారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆదివారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మోదీతో క్రిస్టోఫర్ లక్సన్ భేటీ అయ్యారు.
సమావేశం అనంతరం మోదీ స్పందిస్తూ.."న్యూజిలాండ్‌లోని కొన్ని శక్తులు భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ కు వివరించాం. ఈ శక్తులన్నింటిని నాశనం చేయడానికి న్యూజిలాండ్ తో కలిసి పనిచేస్తాం. ఈ అంశంలో క్రిస్టోఫర్ లక్సన్ సహకారం మాకు లభిస్తుందని విశ్వసిస్తున్నాం.
ఇరు దేశాల మధ్య డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా త్వరలోనే ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించనున్నాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్ టీఏ)లో భాగంగా పాడి పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా వంటి కీలక రంగాలలో పరస్పర సహకారంతోపాటు పెట్టుబడులను కూడా ప్రోత్సహించనున్నాం" అని మోదీ పేర్కొన్నారు. తాము కేవలం అభివృద్ధి విధానాన్ని విశ్వసిస్తామని..విస్తరణవాదాన్ని కాదని స్పష్టం చేశారు. ఇండో-పసిఫిక్‌కు బహిరంగ మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు.
ఎఫ్ టీఏ చర్చల సందర్భంగా డిజిటల్ చెల్లింపుల రంగంలో సహకారాన్ని త్వరగా అమలు చేయడానికి ఇరువైపులా సంబంధిత అధికారుల మధ్య చర్చలకు అంగీకరించామని మోదీ పేర్కొన్నారు. ఇక భేటీలో భాగంగా వాణిజ్యం, రక్షణ, విద్య, వ్యవసాయం లాంటి రంగాలపై ఇరుదేశాల నేతల మధ్య చర్చలు జరిగాయి. చర్చల అనంతరం ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, అగ్రికల్చర్, వాతావరణ మార్పు వంటి అనేక రంగాలలో సహకారానికి సంబంధించిన ఆరు ఒప్పందాలపై నేతలిద్దరూ సంతకాలు చేశారు.