లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన MRO

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన MRO
  • రూ.4.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుపడిన వైనం

విశాఖపట్టణం: కొనుగోలు చేసిన భూమి హక్కులు బదలాయించేందుకు లంచం డిమాండ్ చేసిన చోడవరం తాహశీల్దార్ రవికుమార్, డిప్యూటీ తాహశీల్దార్ రాజాలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాడులు చేస్తే పట్టుపడకుండా జాగ్రత్తపడినప్పటికీ ఏసీబీ వారి ముందు వీరి ఆటలు చెల్లలేదు. లంచం డబ్బు నేరుగా తీసుకునేందుకు నిరాకరించిన వీరు కారు డ్రైవర్ కు ఇమ్మని చెప్పారు. కారు డ్రైవర్ కు లంచం డబ్బు ముట్టిన విషయం తెలుసుకుని గుట్టు చప్పుడు కాకుండా కారు డ్రైవర్ వద్దకు వెళ్లి.. అతని వద్ద కవర్ లోని డబ్బులు తీసుకుని వాటాలు పంచుకుంటుండగా.. అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంటనే కెమికల్ టెస్ట్ చేయగా పాజిటివ్ గా తేలింది. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని సోదాలు జరుపుతున్నారు.

ఏం జరిగిందంటే...

చోడవరం మండలం గాంధీ గ్రామానికి చెందిన చలపతిశెట్టి, వెంకటరామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు కలసి నర్సాపురం గ్రామం వద్ద 1.66 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఈ భూమి హక్కులు తమ పేరుపై మార్పిడి చేయించుకునేందుకు తాహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా.. రోజూ తిప్పుకుంటున్నారు. దీంతో విసిగిపోయిన బాధితులు తమ పరిస్థితి ఏమిటని.. ఏ కారణం చెప్పకుండా ఎందుకు తిప్పుకుంటున్నారని ప్రశ్నించగా.. సెటిల్మెంట్ గురించి తెలియజేశారు. మధ్యవర్తి ద్వారా రూ.20 లక్షలు లంచం డబ్బు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమనన్నారు. చివరకు రూ. 4 లక్షలు ఇచ్చుకోగలమని బాధితులు మొరపెట్టుకుంటే సరేనన్నారు. వెంటనే బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారు రూ.4 లక్షలు ఇచ్చి అవకాశం కోసం ఎదురు చూశారు.

ఈ క్రమంలో గురువారం లంచం డబ్బు ఎక్కడ ఇవ్వాలని బాధితులతో ఫోన్ చేయించగా.. నేరుగా తమ వద్దకు రావద్దని.. తమ కారు డ్రైవర్ కు ఇచ్చి వెళ్లమని సూచించారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులతో కలసి కారు డ్రైవర్ కు ఇచ్చారు. డబ్బు ముట్టిందని పసిగట్టి రహస్యంగా డ్రైవర్ వద్దకు వచ్చిన తాహశీల్దార్, డిప్యూటీ తాహశీల్దార్ లంచం డబ్బులు ఎంచుకుని.. జేబుల్లో పెట్టుకుని తమ తమ సీట్లలోకి వెళ్లిపోతుంటే ఏసీబీ వారు ఎంటరై హ్యాండ్సప్ అన్నారు. వారి వద్ద ఉన్న నగదు తీసుకుని కెమికల్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో తాహశీల్దార్ ఆఫీసును ఏసీబీ అధికారులు మొహరించి తనిఖీలు చేశారు. ఏసీబీ దాడుల గురించి తెలిసిన జనం పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు రాగా ఎవరినీ అనుమతించకుండా సోదాలు చేయడం సంచలనం సృష్టించింది.