
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లు క్లోజ్ చేసినా టీఎస్ జెన్‌కో కరెంట్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ ఆరోపించింది. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి తెలంగాణ చేస్తున్న కరెంట్ ఉత్పత్తిని వెంటనే నిలిపి వేయించాలని కృష్ణా బోర్డుకు ఏపీ కంప్లైంట్ చేసింది. ఈమేరకు ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి కేఆర్‌ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్‌కు శుక్రవారం లెటర్ రాశారు. శ్రీశైలంలో సెప్టెంబర్ 24న 213.40 టీఎంసీల నీరు ఉండగా.. ఐదు రోజులుగా ఏపీ, తెలంగాణ చేసిన పవర్ జనరేషన్-తో 18.19 టీఎంసీలు దిగువకు వెళ్లిందని తెలిపారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువపై ఉన్న పవర్ హౌస్‌లోనూ టీఎస్ జెన్‌కో కరెంట్ ఉత్పత్తి కొనసాగిస్తోందన్నారు.
వాటర్ ఇయర్ ముగిసే వరకు రెండు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాల కోసం రెండు రిజర్వాయర్లలో నీటి నిల్వలు కొనసాగించాల్సి ఉందన్నారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌లోనూ సాగునీటి తర్వాతే కరెంట్ ఉత్పత్తి చేయాలని స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. కృష్ణా బోర్డు జోక్యం చేసుకొని శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో కరెంట్ ఉత్పత్తి నిలిపి వేయించాలని నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా ఏపీకి నీటిని సరఫరా చేసే మైలవరం బ్రాంచ్ కెనాల్‌కు మరమ్మతులు చేయాలని తెలంగాణను కృష్ణా బోర్డు కోరింది. కెనాల్‌కు తెలంగాణ భూ భాగంలో 36.70 కి.మీ.ల వద్ద గల తూము కొట్టుకుపోయిందని పేర్కొంది.