
- ఇప్పటికే ఏపీ చాలా ఎక్కువ నీటిని వాడుకున్నది
- ఏపీకి మిగిలింది 27 టీఎంసీలే..34 టీఎంసీలు ఎట్ల ఇస్తరు?
- మాకూ ఆయకట్టుంది.. మేమింకా116 టీఎంసీలు వాడుకోవాలి
- ఎండలు ముదురుతున్నందున తాగునీటి సమస్య రానివ్వొద్దని విజ్ఞప్తి
- నాగార్జునసాగర్ జలాలపై నల్గొండ సీఈ, ఏపీ సీఈతో కమిటీ
- నేడు నల్గొండలో సమావేశం.. రేపు మరోసారి బోర్డు మీటింగ్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తన వాటాకు మించి వాడుకున్నదని, శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పుడున్న నీటిని కేవలం తెలంగాణకే ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ అధికారులు తేల్చి చెప్పారు. ‘‘ఏపీకి ఈ వాటర్ ఇయర్లో 666 టీఎంసీల నీటిని కేటాయించగా.. 639 టీఎంసీలు వాడేసింది. శ్రీశైలంలో స్థాయికి మించి నీటిని తరలించుకుపోయింది.
ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ నీటిని తెలంగాణ అవసరాలు తీర్చేందుకే ఉంచాలి” అని స్పష్టం చేశారు. శ్రీశైలంతో పాటు ఇటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కూడా ఏపీ నీటిని తరలించకుండా నియంత్రించాలని బోర్డును డిమాండ్ చేశారు. ఏపీ కోటాలో మిగిలింది 27 టీఎంసీలేనని, అలాంటప్పుడు 34 టీఎంసీలు ఎట్ల అడుగుతారని ప్రశ్నించారు.
సోమవారం జలసౌధలో తెలంగాణ, ఏపీ అధికారులతో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. సెక్రటరీల స్థాయిలో నిర్వహించిన ఈ మీటింగ్‌కు ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ హాజరు కాలేదు. తెలంగాణ తరఫున ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్‌కుమార్, ఇంటర్ స్టేట్ వాటర్ రీసోర్సెస్ అధికారులు, ఏపీ తరఫున ఆ రాష్ట్ర ఈఎన్సీ వెంకటేశ్వర్రావు, అధికారులు హాజరయ్యారు. ఇటు తెలంగాణ ఈఎన్సీ, ఏపీ ఈఎన్సీ కూడా బోర్డు మీటింగ్ అనంతరం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
సీఈలతో కమిటీ
ఏపీ ఆయకట్టుకు ప్రస్తుతం నీటి అవసరం ఉందని ఆ రాష్ట్ర అధికారులు కృష్ణా బోర్డుకు తెలియజేశారు. ఆయకట్టు ఎండిపోకుండా చూడాలన్నారు. ఫిబ్రవరి అవసరాలకు 16 టీఎంసీలు, మార్చి అవసరాలకు 18 టీఎంసీలు ఇవ్వాలని బోర్డుకు ఏపీ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఎక్కువ నీటిని తీసుకుపోయిన నేపథ్యంలో మళ్లీ ఆయకట్టుకు నీటిని ఎట్ల తీసుకెళ్తారంటూ తెలంగాణ అధికారులు ప్రశ్నించారు.
66:34 నిష్పత్తిలో నీటిని తీసుకోవాల్సి ఉన్నా.. ఏపీ 75 శాతం నీళ్లను తీసుకున్నదని బోర్డు దృష్టికి మరోసారి తీసుకొచ్చారు. తెలంగాణలోనూ ఆయకట్టు ఉందని, తాము ఇంకా కోటాలో వాడుకోవాల్సింది 116 టీఎంసీలున్నాయని, అలాంటప్పుడు ఏపీకి కోటాకు మించి నీళ్లు ఎట్ల ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ అవసరాలూ తీర్చాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు.
సాగర్ జలాల వినియోగంపై క్లారిటీ రాకపోవడంతో నల్గొండ సీఈ, ఏపీ సీఈతో కృష్ణా బోర్డు కమిటీ వేసింది. ఇద్దరు సీఈలు మాట్లాడుకుని నీటి వినియోగంపై ఓ నిర్ణయానికి రావాలని సూచించింది. మంగళవారం మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించగా.. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద సహాయ చర్యల్లో ఉన్న నల్గొండ సీఈ అజయ్‌కుమార్ తాను మీటింగ్‌కు రాలేనని చెప్పినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో నల్గొండలోనే మీటింగ్‌ను ఏర్పాటు చేసుకోవాలని.. ఏపీ సీఈ అక్కడికి వెళ్లాలని బోర్డు సూచించినట్టు సమాచారం. వారిద్దరి మీటింగ్ తర్వాత బుధవారం జలసౌధలో మరోసారి బోర్డు త్రీమెంబర్ కమిటీ మీటింగ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. కాగా.. ఎండాకాలం సమీపిస్తుండడం, ఇప్పటికే ఎండలు ముదురుతుండడంతో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ అధికారులు తేల్చిచెప్పారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో తాగునీటి కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ 10 టీఎంసీలను ఉంచాలని వారు స్పష్టం చేశారు.