
ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర విషయాలు చాలా జరిగాయి. 2025, ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇవి రొటీన్ అయినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అంశం హైలెట్ అయ్యింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాను.. లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తూ ఉంటాను అని గతంలో చెప్పిన జగన్.. బడ్జెట్ సమావేశాలకు హాజరు కావటం విశేషం.
సభకు వచ్చిన జగన్.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో ఆందోళనకు దిగారు. పోడియం ఎదుట.. ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. కొద్దిసేపు నిరసనలు చేసిన తర్వాత.. ప్రభుత్వం తీరు, గవర్నర్ స్పీచ్‌కు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. సభకు వచ్చినట్లే వచ్చిన జగన్.. 20 నిమిషాల్లోనే పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేయటం చర్చనీయాంశం అయ్యింది.
ALSO READ | ఎవరికో భయపడి కాదు.. జగన్ అసెంబ్లీకి వెళ్లడంపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ
వైసీపీ సభ్యుల ఆందోళనల మధ్యే స్పీకర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన.. చేపట్టబోయే కార్యక్రమాల గురించి గవర్నర్ వివరించారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని.. అభివృద్ధి, సంక్షేమం నాణేనికి రెండు వైపుల లాంటిదని.. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళుతున్నామని పేర్కొన్నారు.
అలాగే.. ఐటీ నుంచి ఏఐ రెవల్యూషన్ దిశగా ఏపీ సాగుతోందని.. పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక.. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీని రేపటికి (ఫిబ్రవరి 25) వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. రేపు (ఫిబ్రవరి 25) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు.