5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  • ఏపీ అసెంబ్లీ ఎదుట వైసీపీ ధర్నా
  • గవర్నర్ స్పీచ్​ను బాయ్ కాట్ చేసిన వైసీపీ 
  • రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నం: గవర్నర్ అబ్దుల్ నజీర్
  • 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు 

అమరావతి, వెలుగు: ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ బయట వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. పోలీసుల జులం ఎల్లకాలం కొనసాగదని నినాదాలు చేశారు. సోమవారం ఉదయం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు కప్పుకొని, ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్తుండగా గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులను లాక్కొని చింపేశారు. దీంతో జగన్ పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్లకార్డులను లాక్కొని చింపేసే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామని.. ఎప్పుడూ ఇదే విధంగా ఉండదన్నారు. “టోపి మీద ఉన్న సింహాలకు అర్థం తెలుసా, అధికారంలో ఉన్న వారికి సెల్యూట్ కొట్టడం కాదు, మీరు ఉన్నది ప్రజాస్వమ్యాన్ని కాపాడడం కోసం.. గుర్తుపెట్టుకో” అని ఆయన హెచ్చరించారు. అనంతరం అసెంబ్లీలోకి వెళ్లన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం సమయంలో ‘‘సేవ్ డెమోక్రసీ, హత్యరాజకీయాలు మానుకోవాలి ’’ అని నినాదాలు చేశారు. తర్వాత గవర్నర్ స్పీచ్ ను బాయ్ కాట్ చేశారు.

వైసీపీ ప్రభుత్వంతో రాష్ట్రానికి నష్టం

రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. 2014 లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి అన్ని రంగాల్లో నష్టం వాటిల్లిందన్నారు. గవర్నర్ స్పీచ్ తరువాత అసెంబ్లీని మంగళవారంకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వాయిదా వేశారు. తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ మీటింగ్ లో 5 రోజుల పాటు సభ జరపాలని నిర్ణయించారు.. కాగా సభలో శ్వేత పత్రాలను విడుదల చేసేలా అధికారపక్షం ప్రతిపాదించింది. కాగా బీఏసీ సమావేశానికి వైసీపీ సభ్యులు గైర్హజరయ్యారు.

జగన్ పక్కనే సీటు కావాలి: రఘురామ రాజు

అసెంబ్లీ హాల్‌‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ హాల్‌‌లో వైసీపీ అధినేత జగన్‌‌ భుజంపై చెయ్యి వేసి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మాట్లాడారు. కనిపించిన వెంటనే హాయ్ జగన్ అంటూ రఘురామ ఆయన వద్దకు వెళ్లి పలకరించారు.‘‘రోజూ అసెంబ్లీకి రా జగన్’’ అని రఘురామ కోరారు. ‘‘రెగ్యులర్​గా వస్తాను.. మీరే చూస్తరుగా’’ అని జగన్ చెప్పారు. ‘‘ప్రతిపక్షం లేకపోతే ఎలా.. అసెంబ్లీకి రోజూ వస్తే బాగుంటుంది’’ అని జగన్‌‌కు సూచించారు. తర్వాత అటుగా వెళుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌‌ను కలిసిన రఘురామ తనకు జగన్ పక్కనే సీటు కేటాయించాలని కోరారు. తప్పకుండా అంటూ కేశవ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.