AP News: సోమవారం ( జులై22) నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు..

ఏపీలో సభాసమరానికి వేళయింది. సోమవారం  ( జులై 22)నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు.. అయిదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో పూర్తవుతుంది. దీంతో మరో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.. గవర్నర్ ప్రసంగంతో తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చిస్తారు.

ఈ సమావేశాల్లోనే ఓటాన్ బడ్జెట్‌తో పాటుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే ఏపీలో శాంతి భద్రతలు, మద్యం, ఆర్థికశాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు.మరోవైపు అసెంబ్లీ సమావేశాల కోసం టీడీపీ డ్రెస్ కోడ్ కూడా ఫాలో కానుంది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పసుపు రంగు దుస్తులు ధరించి పార్టీ కండువాలు మెడలో వేసుకుని రావాలని టీడీఎల్పీ సూచించింది.