ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూన్ 21 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు సమావేశాలకు ప్రొటెం స్పీకర్గా సీనియర్ సభ్యుడైన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని గవర్నర్ నియమించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఆయన ప్రమాణస్వీకారం చేయిస్తారు. గురువారం ప్రొటెం స్పీకర్గా గోరంట్లతో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు.
మరో వైపు వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే జూన్ 19 నుంచి 21 వరకు జగన్ పులివెందులలో పర్యటించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. అయితే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల తేదీలను ఫిక్స్ చేయడంతో జగన్ పులివెందుల పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు, నేతలతో జూన్ 20న జగన్ విస్తృత సమావేశం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్. మరి రేపటి నుంచి జరిగే సమావేశాలకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు జగన్ హాజరవుతారా? లేదా అన్నది చూడాలి.