
- ఉమ్మడి భవన్ వేదికగా తెలంగాణ కోసం పోరాటం
- కొట్లాడిన రాష్ట్ర నేతలు, జర్నలిస్టులు, ఉద్యమకారులు
న్యూఢిల్లీ, వెలుగు : ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఢిల్లీలోనూ ఉవ్వెత్తున ఎగిసింది. ఢిల్లీలో తెలంగాణ ఉద్యమానికి ఉమ్మడి భవన్ (అప్పట్లో ఏపీ భవన్) వేదికగా నిలిచింది. పోలీసులు ఆంక్షలు పెట్టినా, నాటి ఆంధ్రా పాలకులు అడ్డు నిలిచినా తెలంగాణ బిడ్డలు వెనుకడుగు వేయలేదు. ఉమ్మడి భవన్ కేవలం ఏపీ భవన్ కాదు.. తెలంగాణ భవన్ అంటూ గొంతెత్తారు. ఉద్యోగులు ప్రాంతాలవారీగా చీలిపోయారు. తెలంగాణకు చెందిన జర్నలిస్టులు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(టీజేఎఫ్) పేరుతో ఇండియా గేట్ వరకు ర్యాలీ తీసి ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని నేషనల్ మీడియా దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ కోసం ఉద్యమకారుడు యాదిరెడ్డి ఢిల్లీలో ఉరేసుకున్నాడు. ఆ అమరుడి భౌతిక కాయాన్ని ఉమ్మడి భవన్‌కు తరలించకుండా ఏపీ ఉద్యోగులు కొందరు కుట్ర చేయడంతో తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు భగ్గుమన్నాయి. ఢిల్లీలోని ఉమ్మడి భవన్ అగ్ని గుండమైంది. ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు ఈ భవన్ లోనే అడ్డుకున్నారు.
నాడు ఏపీ, నేడు నార్త్ ఎంప్లాయీస్ చేతుల్లో...
ఎన్నో పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నప్పటికీ ఢిల్లీలో తెలంగాణ భవన్ మాత్రం ఏర్పడలేదు. పదేండ్ల పాలనలో ఉమ్మడి భవన్ ఆస్తుల పంపకాన్ని కేసీఆర్ పట్టించుకోలేదు. ఢిల్లీలోని ఉమ్మడి భవన్ నిజాం సొంతమని, తెలంగాణకే దక్కుతుందని చెబుతూ వచ్చారే తప్ప.. అది తెలంగాణకు దక్కేలా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కొత్త భవనం కూడా నిర్మించలేదు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ నిర్మిస్తున్న భవనానికి తెలంగాణ భవన్ అని పేరు పెట్టి, తెలంగాణ అంటేనే తన పార్టీ అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి భవన్‌ను తాత్కాలికంగా ఏపీ, తెలంగాణ అని విభజించినా అది ఏపీ భవన్ గానే అందరి నోట్లో నానుతోంది. ఇక భవన్ క్యాంటీన్ కాస్తా ఏపీ భవన్ క్యాంటీన్ గానే ఉంది. కాగా, ఆనాడు ఏపీ అధికారుల చేతుల్లో ఉమ్మడి భవన్ ఉంటే, ఇప్పుడు నార్త్ కు చెందిన అధికారుల చేతుల్లో ఉందన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని ఢిల్లీలోని తెలంగాణ సంఘాలు కోరుతున్నాయి.
త్వరలో తెలంగాణ భవన్ నిర్మాణం..
ఉమ్మడి భవన్ విభజనను కేసీఆర్ పదేండ్లు నాన్చితే.. సీఎం రేవంత్ రెడ్డి 15 రోజుల్లో తేల్చేశారు. రాష్ట్ర నిర్ణయాన్ని స్పష్టంగా తెలిపి ఉమ్మడి భవన్ ఆస్తుల పంపకాన్ని ముగించారు. ఇందుకు ఏపీ ప్రభుత్వాన్ని, కేంద్ర హోం శాఖను ఒప్పించారు. దీంతో తెలంగాణకు పటౌడీ హౌస్ లో ఐదున్నర, శబరి బ్లాక్ వైపు 3 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేంద్రం గెజిట్ రిలీజ్ చేసింది. పటౌడీ హౌస్ లోని ఐదున్నర ఎకరాల్లో తెలంగాణ ఖ్యాతిని చాటేలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భవన్ నిర్మించనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే స్థలాన్ని పరిశీలించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ భవన్ కు సీఎం రేవంత్ భూమిపూజ చేస్తారని ఆయన తెలిపారు.