![ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపేస్తున్నారు..!](https://static.v6velugu.com/uploads/2025/02/ap-bird-flu-effect-poultry-transport-vehicles-coming-from-ap-to-telangana-are-being-sent-back_3rcPbZyjmh.jpg)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను పోలీసులు వెనక్కి పంపుతున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు కోళ్ల వాహనం కాదు కదా ఒక్క కోడిని కూడా రానివ్వకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీ నుంచి కోళ్ల వాహనాలను తెలంగాణకు రానివ్వకుండా అడ్డుకోవడం తాత్కాలికమే అయినప్పటికీ ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ అదుపులోకి వచ్చేంతవరకూ తెలంగాణకు ఆంధ్రా నుంచి కోళ్ల వాహనాలను రానివ్వకూడదని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బర్ల్ ఫ్లూ కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ రెండు జిల్లాల్లోని పలు కోళ్ల ఫారాల్లో వందల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో ఉమ్మడి గోదావరి జిల్లా వాసుల్లో భయం మొదలైంది. కిలో చికెన్ 30 రూపాయలకే అమ్ముతున్నా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
Also Read :- తెలంగాణలో రూ.150 ఉన్న లైట్ బీరు.. ఎంతకు అమ్ముతున్నారంటే..
పెరవలి మండలం కానూరు గ్రామంలో చాలా కోళ్లు చనిపోయాయి. దీంతో.. ఈ గ్రామంలోని పౌల్ట్రీల్లో చనిపోయిన కోళ్ల శాంపిల్స్ సేకరించి పుణె ల్యాబ్కు పంపించారు. బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చింది. దీంతో.. ఏపీలో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. కోళ్లు ఎక్కడ చనిపోతున్నా పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ జారీ చేశారు.
ప్రజలు కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. తణుకు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షలాది కోళ్ళు చనిపోయాయి. ఒక్కో కోళ్ల ఫారంలో రోజుకు 10 వేలకు పైగా కోళ్లు చనిపోతున్నాయి. బర్ల్ ఫ్లూ భయంతో చికెన్ సెంటర్లకు ఉమ్మడి గోదావరి జిల్లా వాసులు ఆమడ దూరంలో ఉంటున్నారు.