
ఏపీ ప్రభుత్వం రైతన్నలకు శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ కోసం బడ్జెట్‌లో రూ.6,300 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద రైతు ప్రతి ఏటా రూ. 20 వేలు అందుకోనున్నారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
పీఎం కిసాన్.. రూ. 6 వేలు
ఇప్పటికే రైతన్నలకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతన్నలకు ఏటా రూ. 6వేలు జమ చేస్తోంది. కేంద్రం ఇచ్చే రూ. 6వేలకు ఏపీ ప్రభుత్వం మరో 14వేలు కలిపి ఏడాదికి రూ. 20వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మూడు విడతల్లో ఈ మొత్తాన్ని రైతులకు చెల్లించనున్నారు.
బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు
కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమైన హామీల్లో మరొకటి తల్లికి వందనం. ఈ పథకానికి ఏపీ ప్రబుత్వం బడ్జెట్‌లో రూ.9వేల 407 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15000 చొప్పున అందిస్తారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి.1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.