
కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమైన హామీల్లో పోలవరం ప్రాజెక్ట్ కూడా ఒకటి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయటానికి చిత్తశుద్ధితో ఉన్నట్లు ప్రకటించింది చంద్రబాబు ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది.
ఏపీ బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి 6 వేల 705 కోట్లు కేటాయించింది. నిధుల సమస్యతో నిర్మాణ పనులు ఆలస్యంగా నడుస్తున్నాయి ఇప్పటి వరకు. బడ్జెట్ లోనే పోలవరానికి 6 వేల 705 కోట్లు కేటాయించటం ద్వారా.. ఇక నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోనుంది.
వాస్తవంగా పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. కేంద్రమే 100 శాతం నిధులతో నిర్మించాల్సి ఉంది. కేంద్రమే ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం నిర్మాణ బాధ్యతను అప్పట్లో సీఎం చంద్రబాబు తీసుకున్నారు. నిధులు మాత్రం కేంద్రం విడుదల చేస్తూ వస్తుంది. జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పినా.. అలాంటిది ఏమీ జరగలేదు. దీంతో గత ఎన్నికల్లో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు హామీ ఇచ్చాయి.
అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. కేంద్రంతో సంబంధం లేకుండా.. కేంద్రం నిధులతో సంబంధం లేకుండా రాష్ట్ర బడ్జెట్ లోనే 6 వేల 705 కోట్లు కేటాయించటంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ లోనే ఇన్ని భారీ నిధులు కేటాయించటం ద్వారా ఇక నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోనున్నాయి.