ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రేపు రాష్ట్ర కేబినేట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ కు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. మార్చి 18న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14న ప్రారంభం కానున్నాయి. గవర్నర్ అబ్దల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇది ఆయన గవర్నర్ గా బాధ్యతల స్వీకరించిన తరువాత జరుగుతున్న తొలి సమావేశం. గవర్నర్ ప్రసంగం తరువాత అసెంబ్లీ బీఏసీ సమావేశం కానుంది. ఈ భేటీలో సమావేశాల నిర్వహణ, అజెండాపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్ రూ 2.56 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టగా.. ఈ సారి ఆ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ సమావేశాల్లోనే విశాఖ నుంచి పాలన పైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుందనే వార్తలు కూడా వినిపిస్తు్న్నాయి.