
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 6 వేల 100 పోస్టులతో డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.
మొదట టెట్ నిర్వహించి.. ఫలితాలు ఇచ్చిన తర్వాత డీఎస్సీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్, డీఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు.
ఏపీలో చివరిసారిగా 2022లో టెట్ నిర్వహించారు. అప్పుడు 4 లక్షల 50 వేల మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే.. 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారు ఐదు లక్షల మంది టెట్‌కు హాజరుకావొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.
మరో రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్న సమయంలో.. సీఎం జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. గత ఎన్నికల సమయంలో మెగా డీఎస్సీకి హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టిన జగన్ సర్కార్.. స్కూల్స్ బాగుచేయటంతోపాటు అమ్మఒడి, గోరుముద్ద అమలు చేస్తున్నారు. అదే విధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతోపాటు పిల్లలకు ఉచితంగా యూనిఫాం, పుస్తకాలు, షూస్ అందిస్తున్నారు.
విద్యా వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా మరింత పటిష్ఠం చేసే ఉద్దేశంతో.. మెగా డీఎస్సీకి రెడీ అయ్యింది ఏపీ సర్కార్. ఒకే సారి 6 వేల టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్. 2024, జనవరి 31వ తేదీ జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు.