ఏపీలో కొత్త మద్యం పాలసీ ప్రైవేట్ లిక్కర్ ​షాపులకు అనుమతి

ఏపీలో కొత్త మద్యం పాలసీ ప్రైవేట్ లిక్కర్ ​షాపులకు అనుమతి
  • రూ.100లోపు క్వాలిటీ మద్యం అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయం
  • మళ్లీ వలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ
  • కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

హైదరాబాద్, వెలుగు: .ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది. బుధవారం ఆ రాష్ట్ర సెక్రటేరియెట్ లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇందులో భాగంగా కొత్త లిక్కర్ పాలసీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అలాగే, ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.100 లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని కేబినెట్ నిర్ణయించింది. రూ.99కే క్వాలిటీ లిక్కర్ అందుబాటులోకి తేవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల మొదటి వారం నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులోకి రానుంది.

అలాగే, సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్​సిలిండర్ల పంపిణీ పథకం ప్రారంభానికి నిర్ణయించింది. వలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై ఏపీ కేబినెట్‌‌‌‌లో చర్చకు వచ్చింది. గతేడాది ఆగస్టులోనే వలంటీర్ల కాలపరిమితి ముగిసిందని ఈ సందర్భంగా అధికారులు కేబినెట్‌‌‌‌‌‌‌‌కు తెలిపారు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వలంటీర్లతో మాజీ సీఎం రాజీనామా చేయించారని పలువురు మంత్రులు తెలిపారు. 

బోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు

విజయనగరం జిల్లాల్లో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు “అల్లూరి సీతారామరాజు ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్” అని పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనకు, రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్లింగ్ అకాడమీ ఏర్పాటు, వలంటీర్లు, సచివాలయాలకు దినపత్రికల కోసం  నెలనెలా ఇచ్చే రూ.200 -జీవో రద్దు, ఎస్‌‌‌‌టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ప్రాక్షన్ (స్టెమీ), రాష్ట్రీయ బాల  స్వాస్థ్య కార్యక్రమాలు ప్రారంభం, రూ.3 కోట్ల కార్పస్ నిధితో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీస్‌‌‌‌మెన్  కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపెక్సో ) ఏర్పాటు 2024,  నవంబర్ 1న స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ విడుదలకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచార శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు.