- సీఎంగా చంద్రబాబు, మంత్రిగా పవన్ ప్రమాణం
- హాజరైన మోదీ, అమిత్ షా, నడ్డా
- మినిస్టర్ బెర్త్‌ల్లో టీడీపీకి 20, జనసేనకు 3, బీజేపీకి ఒకటి
- 13 మంది ఓసీ, ఏడుగురు బీసీ, ఇద్దరు ఎస్సీ.. ఎస్టీ, మైనారిటీ నుంచి ఒక్కొక్కరికి చాన్స్
- తిరుమలకు చంద్రబాబు.. నేడు బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. బుధవారం కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ స్వాగతం పలికారు.
అక్కడి నుంచి మోదీ, చంద్రబాబు ఒకే వెహికల్ లో కేసరపల్లికి చేరుకున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, బండి సంజయ్, అనుప్రియా పటేల్, చిరాగ్ పాశ్వాన్, శ్రీనివాస వర్మ, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మహారాష్ర్ట సీఎం ఏక్ నాథ్ షిండే, సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, బీజేపీ ఏపీ చీఫ్, ఎంపీ పురందేశ్వరి, నటులు రజినీకాంత్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
కాగా, చంద్రబాబు ప్రమాణస్వీకారంలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు. మరోవైపు పవన్ ప్రమాణస్వీకారం చేయగా, మెగా ఫ్యామిలీ అంతా అటెండ్ అయింది. కానీ అల్లు ఫ్యామిలీ లేకపోవడం, ట్విట్టర్ (ఎక్స్)లో అల్లు అర్జున్ ను సాయిధరమ్ తేజ్ అన్ ఫాలో కొట్టడం చర్చనీయాంశంగా మారింది.
17 మంది కొత్తవాళ్లే..
కేబినెట్ లో సీఎం చంద్రబాబు సహా 26 మందికి అవకాశం ఉంది. అయితే 24 మందికి మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు.. ఒక బెర్త్ ను ఖాళీగా ఉంచారు. మంత్రి పదవుల్లో టీడీపీకి 20, జనసేనకు 3, బీజేపీకి 1 దక్కాయి. జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కు అవకాశం దక్కింది. కేబినెట్ లో ఏడుగురు బీసీ, 13 మంది ఓసీ, ఇద్దరు ఎస్సీలు ఉండగా.. ఎస్టీ, మైనారిటీ కేటగిరీల నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించారు. వీరిలో 17 మంది తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్నారు.
టీడీపీ నుంచి 13 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక్కరు మొదటిసారి మంత్రులు అయ్యారు. గతంలో చంద్రబాబు కేబినెట్ లో పని చేసిన నారా లోకేశ్, ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, కొల్లు రవీంద్ర, అచ్చెంనాయుడు, పార్థసారథికి మళ్లీ ఈసారి అవకాశం దక్కింది.
తొలిరోజే ఐదు హామీల అమలు..
ప్రమాణస్వీకారం తర్వాత కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమలకు చేరుకున్నారు. ఆయన గురువారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 4:41 గంటలకు వెలగపూడిలోని సెక్రటేరియెట్ లో సీఎంగా బాధ్యతలు చేపడతారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేయనున్నారు.
మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ రూ.4 వేలకు పెంపు, స్కిల్ సైన్సెస్, అన్నా క్యాంటీన్ ల ఏర్పాటుపై సంతకాలు చేస్తారు. కాగా, తన నివాసంలో కొత్త మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. గురువారం అందరికీ శాఖలు కేటాయిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలని సూచించారు.
ప్రధాని ఆత్మీయ ఆలింగనం..
ప్రధాని మోదీకి తిరుమల శ్రీవారి ఫొటోను అంద జేసి చంద్రబాబు సన్మానించారు. ప్రమాణస్వీకారం పూర్తయ్యాక చంద్రబాబును మోదీ ఆలింగనం చేసుకుని, అభినందనలు తెలిపారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సం దర్భంగా చిరంజీవి, పవన్ కల్యాణ్ తో కలిసి మోదీ అభివాదం చేశారు.
తమిళిసైపై అమిత్ షా సీరియస్!
చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన తమిళిసైపై అమిత్ షా సీరియస్ అయినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆమె వేదిక మీదకు వచ్చిన తర్వాత అమిత్ షాకు నమస్కారం పెట్టి ముందుకువెళ్లారు. అయితే ఆమెను పిలిచిన అమిత్ షా.. ఏదో చెబుతూ హెచ్చరించినట్టు వీడియోలో ఉన్నది. తమిళనాడు బీజేపీలో గొడవలు జరుగుతున్నాయని, స్టేట్ చీఫ్ అన్నామలైతో విభేదాల నేపథ్యంలోనే తమిళిసైని అమిత్ షా హెచ్చరించినట్టు తెలుస్తున్నది.