ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) నగరంగా తీర్చిదిద్దాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గురువారం పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులతో సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తి చేయడానికి పట్టే సమయం, పనులు చేపట్టడానికి టెండర్లు పిలవడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
కృత్రిమ మేధ ఉట్టిపడేలా రాజధాని లోగో
కృత్రిమ మేధ ప్రతిబింబించేలా అమరావతి లోగోను ఆంగ్లంలో 'అమరావతి' పేరులో మొదటి అక్షరం A, చివరి అక్షరం I కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా లోగో రూపొందించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. రాజధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడేలా రాజధాని నిర్మాణం ఉండాలన్నారు.
ఇంకో 3వేల ఎకరాలు
రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంకా 3,558 ఎకరాలు సేకరించాల్సి ఉందని, ఆ భూములు ఇవ్వడానికి రెండు గ్రామాల రైతులు ముందుకొస్తున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో రాజధాని పరిధిలో జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. జంగిల్ క్లియరెన్స్ కోసం 190 హిటాచి మిషన్లు కంప చెట్లను తొలగిస్తున్నాయని, దాదాపు 60 శాతం జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు.
మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వేగవంతం
విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టును రెండు ఫేజుల్లో చేపడతామని ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణా రెడ్డి సీఎంకి వివరించారు. ఫేజ్-1లో 46 కిలో మీటర్ల మేర రూ.11,400 కోట్ల వ్యయంతో, ఫేజ్-2లో 30 కిలోమీటర్ల మేర రూ.5,734 కోట్లతో మెట్రో రైలు నిర్మిస్తామన్నారు. ఫేజ్-1 మెట్రో రైలు పనులు మొదలుపెట్టి నాలుగేళ్లలోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే విజయవాడలో 38 కిలోమీటర్ల మేర రూ.11వేల కోట్లతో చేపట్టబోయే మెట్రో రైలు నిర్మాణ ప్రాజెక్టు పనులను కూడా వేగవంతం చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.