స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో దాదాపు రూ. 550 కోట్ల అవినీతి జరిగిందని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. చంద్రబాబుకు అన్ని విషయాలు తెలిసే జరిగాయని అన్నారు. దీనికి సంబంధించి తమ వద్ద సమాచారం ఉందన్నారు. ఆయన కేంద్రంగానే అవన్నీ జరగడంతో ఏ1గా చేర్చామని తెలిపారు. ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండానే షెల్ కంపెనీలకు రూ. 371 కోట్లు విడుదల చేశారన్నారు. తమ విచారణలో చంద్రబాబు ప్రధాన లబ్థిదారుడిగా తేలిందన్నారు. ప్రభుత్వ ధనాన్ని షెల్ కంపెనీల ద్వారా బదిలీ చేసన కేసులో ముఖ్య కుట్రదారి చంద్రబాబని తెలిపారు. ఈ కేసులో ఆయనపై ఆరోపణలు నిజమైతే కనీసం పదేళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు.మాజీ మంత్రి నారా లోకేష్ సన్నిహితులకు కూడా ప్రమేయం ఉందన్నారు సంజయ్. దీనిపై లోకేష్ ను కూడా ప్రశ్నించాల్సి ఉందన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ పొగ్రాంను స్కామ్ చేసేందుకే ప్రారంభించారని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ అన్నారు. ఇందుకోసం నాటి కేబినేట్ ఆమోదం లేకుండానే స్కిల్ కార్పొరేషన్ ను తీసుకువచ్చారని అన్నారు. గంటా సుబ్బరావుకు కార్పొరేషన్ ఎండీ,సీఈవోగా నియమించారని చెప్పారు. దురుద్దేశంతోనే సుబ్బారావుకు నాలుగు పదవులు కట్టబెట్టారని తెలిపారు. ఈయన ద్వారా డబ్బులు మల్లించేలా వ్యూహం రచించారని వివరాలు వెల్లడించారు. చంద్రబాబును విజయవాడలోని ఏసీబీ కోర్టులో సాయంత్రంలోపు హాజరు పరుస్తామని సంజయ్ తెలిపారు.