
- హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ సోదాలు
- టీడీపీ నేత అయ్యన్న కొడుకు విజయ్ ఇంట్లో తనిఖీలు
- 6న విచారణకు హాజరు కావాలని నోటీసు
హైదరాబాద్, వెలుగు: ఏపీ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కొడుకు చింతకాయల విజయ్ కుమార్ ఇంట్లో శనివారం ఏపీ సీఐడీ పోలీసులు సోదాలు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని ట్రెండ్‌సెట్ విల్లాలోని ఆయన ఇంట్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయ్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడలకు 41(ఏ) సీఆర్‌పీసీ నోటీసులు అంటించి వెళ్లారు. ఈనెల 6న ఉదయం 10.30 కు మంగళగిరి సీఐడీ ఆఫీసులో హాజరు కావాలని ఆ నోటీసులో ఆదేశించారు. లేకపోతే 41ఏ (3) (4) కింద అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. మఫ్టీలో వచ్చిన పోలీసులను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించకపోవడంతో కొద్దిసేపు అయోమయ పరిస్థితి నెలకొంది.
శనివారమే కేసు నమోదు
ఏపీలో గత కొద్దిరోజులుగా గూగుల్‌పే, ఫోన్‌పే తరహాలోనే భారతి పే పేరుతో ఓ యాప్ పేజ్ సర్క్యులేట్ అయ్యింది. సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారడంతో వైసీపీ శ్రేణులు, ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టింగ్స్ ఆధారంగా ఏపీ సీఐడీ వింగ్ సైబర్‌క్రైమ్ పీఎస్ పోలీసులు సుమోటోగా తీసుకుని శనివారం కేసు నమోదు చేశారు. ఐటీ చట్టంతో పాటు, ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. టీడీపీకి చెందిన ఐటీ వింగ్‌లోని ఐటీడీపీ ద్వారానే భారతి పే పేజ్ క్రియేట్ చేశారని ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే ఐటీడీపీ నిర్వాహకుడిగా ఉన్న చింతకాయల విజయ్‌కుమార్‌తో పాటు మరికొంత మందిని నిందితులుగా చేర్చారు.