హైదరాబాద్: ఏ ఒక్క ఎమ్మెల్యే వల్ల పార్టీకి, తనకు చెడ్డ పేరు వచ్చినా సహించేది లేదని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. చెడ్డ పేరు తెచ్చుకునేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, వాళ్ల వివరాలు తన దగ్గర ఉన్నాయని బాబు బాంబు పేల్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయొద్దని, అది తన విధానం కాదని చెప్పారు. తప్పు చేసింది ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్షిద్దామని నేతలకు స్పష్టం చేశారు.
మద్యం విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు కీలక సూచన చేశారు. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారంలోకి రావడానికి టీడీపీ కేడర్ ఎన్నో త్యాగాలు చేసిందని, కార్యకర్తలు ఆవేశంగా ఉన్నారని, కేడర్ను విస్మరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఎన్డీయే సమావేశంలో కీలక అంశాలు చర్చకొచ్చాయని, ప్రధాని మోదీని చూసి అందరం నేర్చుకోవాలని ఏపీ సీఎం చెప్పుకొచ్చారు.
ALSO READ | బాబు పాలనలో దోచుకో, పంచుకొని తిను అన్నట్టే ఉంది: వైఎస్ జగన్
దేశంలో ఎవరికీ దక్కని విజయం మోదీకి వచ్చిందని, ఆ విజయం వెనుక ఎంతో కఠోర శ్రమ, క్రమశిక్షణ ఉందని చంద్రబాబు చెప్పారు. మోదీ ఎక్కడా తప్పు చేయలేదని, ఆయన పార్టీనీ చేయనీయలేదని ప్రధానిని టీడీపీ అధినేత కొనియాడారు. దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించిందని.. వైసీపీ 11 సీట్లకు ఎందుకు పడిపోయిందో, టీడీపీ 93 శాతం స్ట్రైక్ రేట్తో ఎందుకు గెలవగలిగిందో గుర్తుంచుకోవాలని చంద్రబాబు హితబోధ చేశారు. ఎన్డీయేతో పొత్తు సందర్భంగా కూడా టీడీపీ పదవులు డిమాండ్ చేయలేదని ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.