వెలిగొండకు కృష్ణా, గోదావరి నీళ్లు తెస్తా: ఏపీ సీఎం చంద్రబాబు

వెలిగొండకు కృష్ణా, గోదావరి నీళ్లు తెస్తా: ఏపీ సీఎం చంద్రబాబు
  • ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా
  • పోలవరం– బనకచర్లతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం

హైదరాబాద్, వెలుగు: ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి.. అటు కృష్ణా నుంచి, ఇటు గోదావరి నుంచి నీళ్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.  మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం నిర్వహించిన  సభలో ఆయన మాట్లాడారు. ‘‘వెలిగొండ ప్రాజెక్టు ఇవ్వండి.. శ్రీశైలం నుంచి నీళ్లు తెండి.. అని మీరు అడిగితే నేనే ఫౌండేషన్ వేశాను.. మధ్యలో గత ముఖ్యమంత్రి వెలిగొండ పూర్తి చేసినట్లు, నీళ్లిచ్చినట్లు మభ్యపెట్టాడు. కానీ చేయలేదు. 

ఇప్పుడు నేను చెప్తున్నా. నేనే ప్రారంభించి నీళ్లు మీకు ఇస్తా. నీళ్లుంటే సంపద వస్తుంది. నీళ్లుంటే డైనమిజం వస్తుంది. నీళ్లు ఒక భద్రత. అందుకే రెండు విధాల ఆలోచన చేస్తున్నా.’’ అని పేర్కొన్నారు.  ‘‘వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేయడం.. శ్రీశైలం నుంచి నీళ్లు తేవ డం! ఒక్కోసారి శ్రీశైలానికి నీళ్లు రాకపోయే ప్రమాదం ఉంటుంది. కనుక కొత్తగా ఒక ఆలో చన చేశాను. గోదావరిలో మిగులు జలాలు సముద్రంలోకి పోతున్నాయి.. ఆ నీళ్లను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అదే పోలవరం నుంచి బనకచర్ల. మొదటి విడత పోలవరం నుంచి కృష్ణాకు తెస్తాం. కృష్ణా నుం చి నాగార్జునసాగర్​ కుడి కాలువకు,  బొల్లపల్లికి తెస్తాం. అక్కడి నుంచి నేరుగా వెలిగొండ కాల్వకు వస్తాయి. నల్లమల ఫారెస్ట్ మీదుగా బనకచర్లకు వెళ్తాయి. 

కాబట్టి మీకు రెండు సోర్సులా నీళ్లు వస్తాయి. భవిష్యత్​లో గోదావరి నీళ్లు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లాకు, ఈ తాలూకాకు వస్తాయి. ఓ పక్క గోదావరి నీళ్లు, మరోపక్క కృష్ణా నీళ్లను కూడా అనుసంధానం చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. నీళ్లు తేవడమే కాదు, ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా, గోదావరి టు బనకచర్ల లింకు ప్రాజెక్టును ప్రతిపాదించిన చంద్రబాబు దాని అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా గోదావరి నీళ్లను చూపుతూ, కృష్ణా నీటిని అటు రాయలసీమకు, ఇటు ఆంధ్రాలోంచి చాలా ప్రాంతాలకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ఇరిగేషన్ ​ఎక్స్​పర్ట్స్​ ఆరోపిస్తున్నారు. తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.