న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ విధానాలు సరిగ్గా లేవని, గత పదేళ్ల ఆప్ పాలనలో ఢిల్లీలో అభివృద్ధి కుంటపడిందని ఆప్ సర్కార్‌పై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం (ఫిబ్రవరి 3) సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ వాయు, రాజకీయ కలుషితంతో నిండిపోయిందని అన్నారు. ఈ రెండు ఆరోగ్యానికి హానికరమన్నారు. ఆప్ సర్కార్ గత పదేళ్ల పాలన పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
పదేళ్లలో తాగునీటి సమస్యను ఆప్ పరిష్కరించలేకపోయిందన్నారు. గతంలో ఉపాధి, ఉద్యోగాల కోసం అందరూ ఢిల్లీకి వచ్చేవారని.. కానీ ఇప్పుడు ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారన్నారు. దీనికి ప్రధాన కారణం ఢిల్లీలో పెరిగిపోయిన కాలుష్యంతో పాటు.. ఆప్ ప్రభుత్వ విధానాలేనని మండిపడ్డారు. ఇతర స్కాములకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వరస్ట్ అని అన్నారు. పదేళ్లు పాటు అధికారంలో ఉండి యమునా నదిని క్లీన్ చేయలేకపోయారని విమర్శించారు.
ఢిల్లీలో ఉన్నది ఆప్ సర్కార్ కాదు హాఫ్ ఇంజిన్ సర్కార్ అని ఎద్దేవా చేసిన చంద్రబాబు.. ఢిల్లీ అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ పైన చంద్రబాబు స్పందించారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంచనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.